కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ (California Governor Gavin Newsom) తన పదవిని కాపాడుకున్నారు. గవర్నర్ పదవి నుంచి దింపేసేందుకు జరిగిన ప్రయత్నాల నుంచి విజయవంతంగా గట్టెక్కారు. అమెరికా చరిత్రలో 'రీకాల్'ను (California recall) తప్పించుకున్న రెండో గవర్నర్‌గా రికార్డుకెక్కారు.
ఈ మేరకు కాలిఫోర్నియాలో నిర్వహించిన రీకాల్ ఎన్నికల్లో (California recall election) ఘన విజయం సాధించారు. 60 శాతం బ్యాలెట్లను లెక్కించగా.. మూడింట రెండొంతుల మంది ఓటర్లు న్యూసమ్‌ను గవర్నర్ పదవి నుంచి తొలగించేందుకు విముఖత చూపించారు.
ఈ విజయంతో డెమొక్రటిక్ పార్టీలో కీలక నేతగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నారు న్యూసమ్. తర్వాతి అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసే అవకాశాలను మెరుగుపర్చుకున్నారు.
'ట్రంపిజం ఓడింది'
కరోనా మహమ్మారి సహా లాక్డౌన్, టీకా తప్పనిసరి నిబంధనలు కొనసాగుతున్న నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికలు దేశంలో ఓటర్ల అభిప్రాయాలకు అద్దం పడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ మితవాద రాజకీయాలకు ఇదో పరీక్షలాంటిదని చెబుతున్నారు. కాగా, డెమొక్రాట్లు మాత్రం.. తాము ట్రంప్‌ను, ట్రంపిజాన్ని జయించామని చెప్పుకుంటున్నారు.
ఇదీ చదవండి: 'చైనాపై దాడికి సిద్ధమైన ట్రంప్- వణికిపోయిన ఆ అధికారి!'