బ్రెజిల్లో కరోనా ఉద్ధృతి తీవ్రమైంది. లాటిన్ అమెరికా దేశాలతో పోలిస్తే బ్రెజిల్లో రోజురోజుకూ కరోనా మరణాలు భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 3,251 మరణాలు సంభవించాయి. దేశంలో అత్యంత జనాభా కలిగిన సావో పాలో నగరంలోనే 1,021 మంది వైరస్‌కు బలయ్యారు.
బ్రెజిల్ మొత్తం మరణాల సంఖ్య(2,98,843) మూడు లక్షలకు చేరువవుతోంది. అమెరికా తర్వాత ప్రపంచంలో అత్యధిక మరణాలు నమోదైంది ఈ దేశంలోనే. అటు.. 85 వేల కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం బాధితుల సంఖ్య కోటి 21 లక్షల 36 వేలకు చేరింది.
ఒత్తిడిలో సర్కారు
కరోనా కారణంగా ఇప్పటికే బ్రెజిల్ వైద్య వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలో సత్వర చర్యలు చేపట్టాలని బొల్సొనారో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. వైరస్‌ను నిర్లక్ష్యం చేశారని సర్కారుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కేసులు మరణాలు పెరుగుతున్న ఈ సమయంలోనూ.. స్థానిక ప్రభుత్వాలు విధించిన ఆంక్షలను బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో వ్యతిరేకిస్తున్నారు. శుక్రవారం రెండు రాష్ట్రాలు అమలులోకి తీసుకొచ్చిన ఆంక్షలను రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరారు.
కరోనా వ్యాప్తి అనంతరం దేశంలో నాలుగో వ్యక్తి వైద్య శాఖ బాధ్యతలు స్వీకరించారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ మార్సెలో క్వీరోగా.. మంగళవారం వైద్య శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
ఇదీ చదవండి: కరోనా ఉపద్రవం- భారీగా తగ్గిన రెట్టింపు సమయం