బ్రెజిల్లో కరోనా మరణమృదంగం కొనసాగుతూనే ఉంది. దేశంలో కొవిడ్ కోరలకు చిక్కి మృత్యువాత పడ్డవారి సంఖ్య 20 వేలు దాటింది.
లాటిన్ అమెరికా దేశాల్లో కరోనాకు కేంద్రంగా మారింది బ్రెజిల్. కేవలం ఒక్క రోజులోనే 1,188 మంది వైరస్ ధాటికి మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు 20,047 మంది కరోనాకు బలయ్యారు. దాదాపు 3.10 లక్షల కేసులు నమోదయ్యాయి. అయితే, కరోనా పరీక్షల్లో లోపాల కారణంగా ఈ సంఖ్య తక్కువగా ఉందని.. అధికారిక లెక్కలు ఇంకా ఎక్కువే ఉంటాయంటున్నారు నిపుణులు.
అమెరికా, రష్యాల తర్వాత కరోనా కేసుల్లో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది బ్రెజిల్. మరణాల్లో ఆరో స్థానంలో నిలిచింది. మరణాల సంఖ్య కేవలం 11 రోజుల్లోనే రెండింతలు పెరగడం ఆందోళనకరం.
బ్రెజిల్ ఆర్థిక, సాంస్కృతిక రాజధాని సావో పాలో రాష్ట్రంలోని అతిపెద్ద శ్మశానంలో ఎక్కడ చూసినా కరోనా మృతులే దర్శనమిస్తున్నాయి. రియో డె జనేరోలోనూ ఇదే పరిస్థితి.
మరణాలు పెరిగినా.. సడలించారు!
మరణాలు, కేసులు ఇంతెత్తున పెరిగిపోతున్నా.. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు లాక్డౌన్ సడలించేందుకు గురువారం పిలుపునిచ్చారు ఆ దేశ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం కఠిన నిబంధనలు అమలవుతున్నాయి.
ఇదీ చదవండి:ఆ 10వేల మంది హెల్త్‌కేర్ వర్కర్లకు కరోనా!