'మరణం కంటే ప్రేమ గొప్పది' అని నిరూపిస్తున్నారు బ్రెజిల్ ప్రేమికులు. కరోనా కాలంలోనూ తమ ప్రేమను నిరూపించుకుంటూ ఔరా అనిపిస్తున్నారు. వైరస్ విజృంభణతో బ్రెజిల్ వ్యాప్తంగా కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో లాక్డౌన్ ముగిసేవరకూ వేచిచూడకుండా.. వినూత్నంగా కారులోనే పరస్పరం రింగ్‌లు మార్చుకుంటున్నారు. వివాహం చేసుకోవడానికి ఇదీ ఒక మార్గమని చాటిచెబుతున్నారు.
అంతా కారులోనే..
కారులోనే వివాహం చేసుకునే విధంగా.. 'డ్రైవ్-థ్రూ వెడ్డింగ్' పేరిట వినూత్న కార్యక్రమం ప్రారంభించారు రియో డి జెనీరోలోని రిజిస్ట్రేషన్ అధికారులు.
వివాహం చేసుకోదలచిన వారు.. ఒక సాక్షితో కలిసి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వస్తారు. కారు దిగకుండానే అక్కడి సిబ్బందితో తమ పేర్లను నమోదు చేసుకుంటారు. అనంతరం ఒకరికొకరు ఉంగరాలు మార్చుకుంటారు. అంతే.. వీరి పెళ్లిని ధ్రువీకరిస్తున్నట్లు ప్రకటిస్తారు అధికారులు.
లాక్డౌన్ కాలంలో ప్రేమజంటలు వివాహం చేసుకోవడానికి ఇదొక మంచి మార్గమని రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారి తెలిపారు.
'సాధారణ వేడుకల కంటే వేగంగా.. సురక్షితంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనిని చాలా మంది అనుసరిస్తున్నారు. నిబంధనల ప్రకారమే ప్రేమజంటలకు వివాహం చేస్తున్నాం.'
- అలెశాండ్రా లెపోయెంటె, కార్యాలయ అధికారి
ఇదీ చదవండి: మరోసారి పేలిన స్పేస్‌ఎక్స్ రాకెట్