Boy Shot Mother: తుపాకీతో ఆడుకుంటూ మూడేళ్ల బాలుడు పొరపాటున తల్లిని కాల్చిన ఘటన అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో జరిగింది. ఈ దుర్ఘటన బాలుడి తండ్రిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. షికాగోలో శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఏం జరిగిందంటే..?
"షికాగో శివారులో సూపర్ మార్కెట్ వద్ద పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన కారులో కుటుంబ సభ్యులు కూర్చున్నారు. సరిగ్గా అదే సమయంలోనే వెనుక సీటులో కూర్చున్న బాలుడు.. కారులో తుపాకీని చూశాడు. దాంతో ఆడుకోవడం మొదలు పెట్టాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించలేదు. బాలుడు పొరపాటున తుపాకీ పేల్చగా.. అతడి తల్లి మెడలోకి తూట దూసుకెళ్లింది. ఆమెను తక్షణమే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది" అని అధికారులు తెలిపారు.
ఆ తుపాకీ బాలుడి తండ్రిదేనని, లైసెన్స్ ఉందని పోలీసులు నిర్ధరించుకున్నారు. అయితే.. దానిని వాహనంలో తీసుకెళ్లాడానికి అతనికి క్యారీ పర్మిట్ లేదని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఒకరి మరణానికి కారణమైనందుకు బాలుడి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇదీ చూడండి: ఉక్రెయిన్ క్షిపణి దాడిలో 20 మంది మృతి