అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ నల్లజాతీయుల ఓట్లపై డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ప్రచార బృందం దృష్టి పెట్టింది. కరోనా వేళ వ్యక్తిగతంగా ఓటు వేయాలని తన మద్దతుదారులను కోరారు బైడెన్.
ఫిలడెల్ఫియాలో డ్రైవ్-ఇన్ కార్యక్రమంలో పాల్గొన్న బైడెన్.. కరోనా కట్టడిలో అధ్యక్షుడు ట్రంప్ నేరపూరితంగా ప్రవర్తించారని ఆరోపించారు.
"కరోనా వైరస్ విషయంలో మనం రోజూ జాతి ఆధారిత అసమానతలను చూస్తున్నాం. ట్రంప్ కరోనా నియంత్రణ విధానం నేరపూరితం. నల్లజాతీయులకు ఈ మహమ్మారితో భారీ ముప్పు పొంచి ఉంది."
- జో బైడెన్, డెమొక్రటిక్ అభ్యర్థి
కీలక రాష్ట్రాల్లో నల్లజాతీయుల ఓట్లతో తమ గెలుపు అవకాశాలు పెరుగుతాయని డెమొక్రాట్లు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే.. మెయిల్ ఓటింగ్ విధానంపై ట్రంప్ మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ స్వల్ప మెజారిటీతో గెలిస్తే కోర్టును ట్రంప్ ఆశ్రయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ముప్పును తప్పించుకొనేందుకు బైడెన్ విభాగం.. నల్లజాతీయుల ఓట్లపై దృష్టి సారించింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3న జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో బ్యాలెట్ ఓటింగ్ అవకాశాన్ని కల్పించారు.
ఇదీ చూడండి: అధ్యక్ష పోరు: '270 మార్క్' దక్కేదెవరికి?