అమెరికా తదుపరి సర్జన్ జనరల్‌గా భారత సంతతి వైద్యుడు, తన కొవిడ్-19 సలహాదారు అయిన డాక్టర్ వివేక్ మూర్తిని ఎంపిక చేశారు అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్. ఈ మేరకు ఆయన నియామకంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలిపింది వాషింగ్టన్ పోస్ట్.
ప్రస్తుతం బైడెన్ కొవిడ్-19 సలహా బృందంలోని ముగ్గురు సభ్యుల్లో ఒకరిగా ఉన్నారు వివేక్ మూర్తి. ప్రజా ఆరోగ్య విభాగంలో ప్రభుత్వ చీఫ్‌గా నాలుగేళ్ల పాటు వ్యవహరించనున్నారు. ప్రస్తుత సర్జన్ జనరల్ జెరోమ్ అడమ్స్ స్థానంలో మూర్తి బాధ్యతలు స్వీకరించనున్నారు.
గతంలో ఒబామా హయాంలోనే 2014, డిసెంబర్ 15న సర్జన్ జనరల్‌గా నియమితులయ్యారు మూర్తి. సెనేట్‌లో 51-43 మెజారిటీతో ఆయన ఎంపికకు ఆమోదం లభించింది. అయితే.. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2017, ఏప్రిల్ 21న పదవి నుంచి వైదొలిగారు.
కమల చీఫ్ ఆప్ స్టాఫ్‌గా టీనా ఫ్లూర్నోయ్
తన శ్వేతసౌధం సీనియర్ స్టాఫ్‌లో కొత్త సభ్యులను ప్రకటించారు.. అమెరికా ఉపాధ్యక్ష ఎన్నికల విజేత కమలా హారిస్. తన చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా టీనా ఫ్లూర్నోయ్ను ఎంపిక చేశారు. పబ్లిక్ పాలసీ నైపుణ్యం, ప్రజా సేవలో వృత్తి అనుభవం ఆమెను ఈ ముఖ్యమైన పదివికి ప్రత్యేకంగా అర్హత సాధించేలా చేశాయని కొనియాడారు హారిస్.
బైడెన్-హారిస్ అధికార మార్పిడి బృందంలో సీనియర్ సలహాదారుగా ఉన్న రోహిణి కోసోగ్లూను.. ఉపాధ్యక్ష దేశీయ పాలసీ సలహాదారుగా, నాన్సీ మెక్ఎల్డౌనీని.. జాతీయ భద్రతా సలహాదారుగా ఎంపిక చేశా కమల.
ఇదీ చూడండి: చీఫ్ మెడికల్ అడ్వైజర్‌గా ఫౌచీ కొనసాగింపు: బైడెన్