శ్వేతసౌధంతో పాటు కేబినెట్లోనూ తన పాలన యంత్రాంగం పూర్తి వైవిధ్యంగా ఉంటుందని అమెరికా తదుపరి అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అమెరికాలో ఇదివరకు ఎన్నడూ లేని విధమైన కేబినెట్‌ను రూపొందిస్తానని ఉద్ఘాటించారు. వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులు తమకు ఉన్నత స్థానాలు కల్పించాలని కోరుతున్న నేపథ్యంలో ఈ మేరకు స్పందించారు బైడెన్.
"పూర్తి వైవిధ్యమైన కేబినెట్‌ను మీరు చూడబోతున్నారు. ఏ శాఖలో ఏం జరుగుతుందో నేను ఇప్పుడే చెప్పలేను. కానీ, అమెరికాలో ఎప్పుడూ చూడని వైవిధ్యమైన కేబినెట్ ఉంటుందని మీకు హామీ ఇస్తున్నా."
-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
పలు ఆఫ్రో అమెరికన్ బృందాలు తమ ప్రతినిధులకు.. కీలక శాఖలను అప్పగించాలని బైడెన్‌ను కోరుతున్నాయి. విదేశాంగ మంత్రి, ట్రెజరీ శాఖ మంత్రి, రక్షణ మంత్రి, అటార్జీ జనరల్ పదవులలో ఒకటి తమకు కేటాయించాలని అభ్యర్థిస్తున్నాయి.
వైవిధ్యం కోసం కరసరత్తు
అమెరికా పాలన యంత్రాంగంలో కీలకమైన హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ తదుపరి ఛైర్మన్‌గా ఆఫ్రో-అమెరికన్ గ్రెగోరీ మీక్స్‌ను నియమిస్తూ బైడెన్ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఆయన విధుల్లోకి చేరితే ఈ కమిటీకి నేతృత్వం వహించిన తొలి ఆఫ్రో-అమెరికన్‌గా నిలుస్తారు. అమెరికా విదేశాంగ విధానాలు రూపొందించడంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తుంది.
మరోవైపు, ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్‌గా భారతీయ అమెరికన్ నీరా టాండెన్‌ను ఎంపిక చేశారు బైడెన్.