"పారిస్ ఒప్పందం నుంచి వైదొలిగిన అమెరికా"... "ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ట్రంప్"... "చైనాతో అమెరికా వాణిజ్య యుద్ధం"... ఇవీ అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాలుగేళ్ల పాలనలో ప్రపంచ దేశాలను కుదిపేసిన కొన్ని కీలక విషయాలు. 'అమెరికాకే ప్రాధాన్యం' అంటూ అనేక విధానాల్లో మార్పులు తెచ్చారు ట్రంప్.
కానీ అమెరికా అంటే ఒక దేశం కాదు. ప్రపంచ దేశాల్లో అమెరికాకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. దానికి తగ్గట్టుగానే ఎన్నో దశాబ్దాలుగా 'పెద్దన్న' పాత్రను పోషిస్తూ వచ్చింది అమెరికా. కానీ ట్రంప్ చర్యలతో ఆ హోదాకు తూట్లుపడ్డాయి. అధ్యక్షుడి నిర్ణయాలు ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ నేపథ్యంలో.. రానున్న అధ్యక్ష ఎన్నికల్లో మారోమారు ట్రంప్ గెలిస్తే.. అమెరికా తీరు పూర్తిగా మారిపోతుందని రాజకీయ నిపుణులు, సీనియర్ పాత్రికేయులు అభిప్రాయం వక్తం చేస్తున్నారు.
నాయకత్వం నుంచి దూరం...
అనేక సందర్భాలలో నాయకత్వం వహించిన అమెరికా.. ఇప్పుడు మెల్లిగా ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటోందని ఐక్యరాజ్యసమితిలోని భారత మాజీ శాశ్వత ప్రతినిధి అశోక్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు.
"1942 నుంచి ప్రపంచానికి అమెరికా నాయకత్వం వహిస్తోంది. ఐరాస స్థాపించినప్పటి నుంచి ఎన్నో సందర్భాల్లో అగ్రరాజ్యం కీలక పాత్ర పోషించింది. కానీ ఇప్పుడది ప్రమాదంలో ఉంది. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు.. ఈ అంశంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇలా అంతర్జాతీయ వేదికల నుంచి తప్పుకోవడం వల్ల ప్రతికూల ప్రభావం ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఇందుకు ఐరాస మానవ హక్కుల మండలి ఓ ఉదాహరణ. మండలి స్థాపనను అమెరికా వ్యతిరేకించింది. కానీ 170 దేశాల మద్దతుతో యూఎన్హెచ్ఆర్సీ ఏర్పాటైంది. ఎన్నో విషయాలను దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. మూడేళ్లు గడిచినా..అగ్రరాజ్యం తన వైఖరిని మార్చుకోలేదు. మండలి లోపల ఉండి విధానాలపై చర్చలు జరపకపోతే... బయట ఉండి కూడా పెద్దగా చేయగలిగేది ఏమీ ఉండదు."
--- అశోక్ మఖర్జీ, ఐరాసలో భారత మాజీ శాశ్వత ప్రతినిధి.
ఇదీ చూడండి:- రానున్న అధ్యక్ష ఎన్నికల్లో అమెరికన్లు ఎవరి పక్షమో?
ముంచుకొస్తున్న చైనా ముప్పు...
ఇదే సమయంలో.. ఐరాస వేదికగా పనిచేస్తున్న అనేక సంస్థలకు అమెరికా అడ్డుపడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వంటి అంతర్జాతీయ సంస్థలకు నిధులను నిలిపివేసింది. అయితే అమెరికా దూరమవుతున్న కొద్దీ.. వీటన్నిటికీ చైనా దగ్గరవుతోందన్నారు ఐరాస మాజీ సాంకేతిక సలహాదారు డా. రాజేశ్వరి పీ రాజగోపాలన్. ఇరాన్‌తో అమెరికా శత్రుత్వాన్ని కూడా చైనా సొమ్ము చేసుకుంటోందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో.. ఒకవేళ అధ్యక్ష బాధ్యతలను డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ చేపడితే.. లెక్కలను సరిచేసే సామర్థ్యం ఆయకు ఉందా? అని ప్రశ్నించారు.
"చైనా వైఖరి పెద్ద సవాలుగా మారింది. అదే సమయంలో ఐరాస సంస్థల్లో చైనా నాయకత్వ పాత్ర పెరుగుతోంది. అమెరికా వైఖరి ఇందుకు ఉపయోగపడింది. ఇప్పుడు ఇరాన్-చైనా ఒక్కటయ్యాయి. ఇరాన్-చైనా-రష్యా మధ్య వ్యూహాత్మక సహకారం కూడా పెరిగింది. ఇవి అమెరికాకు శత్రు దేశాలు. మరి దీనిని బైడెన్ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది? చైనాపై కఠినంగానే ఉంటామని ఇప్పటికే బైడెన్ చెప్పడం వల్ల ఈ సమస్య మరితం తీవ్రం కానుంది."
---డా. రాజేశ్వరి పీ రాజగోపాలన్, ఐరాస మాజీ సాంకేతిక సలహాదారు.
పెద్దన్న పాత్రలో మళ్లీ...
సెనేట్, శ్వేతసౌధం డెమొక్రాట్ల చేతిలో ఉంటే.. ప్రపంచంలో అమెరికా తిరిగి పెద్దన్న పాత్ర వహించే అవకాశముంటుందని అభిప్రాయపడ్డారు సీనియర్ జర్నలిస్ట్ యోషిత సింగ్.
"సెనేట్, శ్వేతసౌధంలో డెమొక్రాట్ల బలం అధికంగా ఉండే అవకాశముంది. అంకెలు అనుకూలంగా ఉంటే... అమెరికాను బైడెన్ తిరిగి పెద్దన్న పాత్రలో కూర్చోబెట్టవచ్చు. ఆయన కచ్చితంగా ఆ పనిచేస్తారు."
--- యోషిత సింగ్, సీనియర్ జర్నలిస్ట్.
ఇదీ చూడండి:- అగ్రరాజ్య రాజకీయాల్లో.. మనోళ్లకే అగ్రస్థానం!
మరోవైపు.. రానున్న 2-3ఏళ్లలో ఐరాస సంస్థల్లో దాదాపు 15ఎన్నికలు జరగనున్నాయని గుర్తుచేశారు యోషిత. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోమారు అధ్యక్ష పదవిని చేపడితే.. చైనాకు పూర్తి బలం ఇచ్చినట్టేనని పేర్కొన్నారు.
"ఎప్పటి నుంచో ఐరాసకు వ్యతిరేకంగా ఉన్నారు ట్రంప్. అందువల్ల ట్రంప్ పాలనలో ఎన్నికలకు అమెరికా అభ్యర్థులు వెళ్లరు. ఐరాసలో తమ పలుకుబడిని పెంచుకుందాం అని అనుకుంటున్న చైనా వంటి దేశాలకు ఇది అవకాశమవుతంది. ఒకవేళ ఆయా సంస్థల్లో తమ అభ్యర్థులు గెలిస్తే.. కీలక నిర్ణయాలు తీసుకునే బాధ్యత చైనా చేతికి వెళుతుంది. దీన్ని అమెరికా గుర్తించి.. అంతర్జాతీయ సంస్థల నుంచి తప్పుకోకూడదు."
--- యోషిత సింగ్, సీనియర్ జర్నలిస్ట్.
ఇదీ చూడండి:- డొనాల్డ్ ట్రంప్ ప్రసంగంపై నిపుణులు ఏమన్నారంటే..