ఉద్గారాలను తగ్గించటంలో అమెరికా సహా ఇతర పెద్ద ఆర్థిక వ్యవస్థలు కృషి చేయాల్సిన అవసరం ఉందని అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాల సదస్సును ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. వాతావరణ మార్పులకు కారకాలైన కర్బన, పెట్రోలియం ఉత్పత్తుల వాడకాన్ని తాము సగం మేర తగ్గిస్తామని బైడెన్ పేర్కొన్నారు.
"ఈ సమావేశం మనం ఈ భూగ్రహాన్ని కాపాడడానికి మాత్రమే కాదు. మనందరి కోసం ఉత్తమ భవిష్యత్తును నిర్మించడానికి కూడా. ఇది ప్రమాదకరమైన క్షణమే.. అయినా అవకాశాలను అందించే క్షణం కూడా. "
-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
2030 నాటికి శిలాజ ఇంధనాల ఉద్గారాలను తాము 52 శాతం మేర తగ్గిస్తామని బైడెన్ ఈ సదస్సులో ప్రకటించారు. ఈ సదస్సు ప్రారంభం కంటే ముందు జపాన్ కూడా తమ కర్బన ఉద్గారాలను 46 శాతం మేర కట్టడి చేస్తామని ప్రకటించింది.
'ఆ దేశాలకు సాయం చేయాలి'
2030 కంటే ముందు నాటికి తమ కర్బన ఉద్గారాలను అత్యంత అధిక స్థాయికి తీసుకువెళ్తామని, 2060 కంటే ముందునాటికి వాటిని తటస్థం చేస్తామని చైనా పునరుద్ఘాటించింది. ఈ మేరకు అమెరికా ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పేర్కొన్నారు.
అభివృద్ధి చెందిన దేశాలు కర్బన ఉద్గారాలకు అధిక బాధ్యత వహిస్తాయని జిన్‌పింగ్ పేర్కొన్నారు. ఆ దేశాలు తమ దేశంలో మార్పులు చేయటం సహా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉద్గారాలను తగ్గించటంలో సాయం చేయాలని కోరారు.
ధనిక దేశాలు ముందుండాలి..
కొవిడ్ మహమ్మారి నుంచి ప్రపంచం త్వరలోనే పునర్వైభవాన్ని సాధిస్తుందని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. ఆ తదనంతరం.. ధనిక దేశాలు వాతావరణ మార్పులను కట్టడి చేసే విషయంలో నేతృత్వం వహించాలని కోరారు. కర్బన ఉద్గారాలను సున్నా శాతానికి పరిమితం చేస్తామన్న తొలిదేశం తమ దేనని జాన్సన్ పేర్కొన్నారు.
సబ్సిడీలు ఎత్తివేయండి..
బొగ్గుపై ధరలు విధించాలని, శిలాజ ఇంధనాలకు సబ్సిడీలు తొలగించాలని ప్రపంచ దేశాల నేతలకు ఈ సదస్సులో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరస్ సూచించారు. కోల్పవర్ ప్లాంట్లకు ఆర్థిక సహాయం చేయడం మానేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ప్రస్తుతం రెడ్ అలర్ట్‌లో ఉందని హెచ్చరించారు.
"ప్రకృతి మాత ఎదురు చూడటం లేదు. మనకు హరిత గ్రహం కావాలి. కానీ, ప్రస్తుతం 'రెడ్ అలర్ట్'లో ఉంది.''
- ఆంటోనియో గుటెరస్, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి
ఇదీ చూడండి: 'పర్యావరణ పరిరక్షణకు పటిష్ఠ చర్యలు అవసరం'