కొవిడ్ నుంచి బయటపడిన వారిలో.. కరోనాను సమర్థంగా ఎదుర్కోగల రోగనిరోధక శక్తి దాదాపు 5 మాసాల వరకు ఉంటుందని పరిశోధనలో తేలింది. భారతీయ మూలాలున్న పరిశోధకులు అమెరికాలోని అరిజోనా విశ్వవిద్యాలయంతో కలిసి చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. దాదాపు 6వేల మంది కొవిడ్ రోగులపై వారు ఈ అధ్యయనం నిర్వహించారు.
తొలి దశలో..
మొదటిసారి వైరస్ సోకిన తర్వాత తొలి దశలో జీవితకాలం తక్కువగా ఉన్న ప్లాస్మా కణాలను.. వైరస్‌పై పోరాడేందుకు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ సిద్ధం చేస్తుందని పరిశోధకులు తెలిపారు. యాంటీబాడీలను ఆ ప్లాస్మా కణాలు విడుదల చేస్తాయని వెల్లడించారు. అవి వైరస్ సోకిన 14 రోజుల వరకూ రక్తపరీక్షల్లో కనిపిస్తాయని చెప్పారు.
రెండో దశలో..
రెండో దశలో జీవితకాలం ఎక్కువగా ఉండే ప్లాస్మా కణాలను.. వైరస్‌తో పోరాడేందుకు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ సిద్ధం చేస్తుంది. ఈ ప్లాస్మా కణాలు విడుదల చేసే యాంటీబాడీలు.. శరీరంలో దాదాపు 5 నుంచి 7 నెలల వరకు క్రియాశీలకంగా పనిచేస్తాయని చెప్పారు.
అయితే, ఈ యాంటీబాడీలు కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పిస్తాయా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం క్లిష్టమేనని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
అలా అయితే రెండేళ్ల వరకూ..
తొలి సార్స్ కరోనా వైరస్ సోకిన వారిలో 17 ఏళ్ల వరకు యాంటీబాడీలు పనిచేశాయని చెప్పారు. ప్రస్తుత కొవిడ్ కారక సార్స్-కోవ్-2 వైరస్ కూడా తొలి వైరస్ తరహాలోనే వ్యవహరిస్తే.. కనీసంగా రెండేళ్ల వరకు యాంటీబాడీలు పనిచేసే అవకాశం ఉందని తెలిపారు.
ఇదీ చూడండి:వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేసిన 'జాన్సన్ అండ్ జాన్సన్'