అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల సమయం కూడా లేదు. ఓవైపు విస్తృత ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి ఇరు పార్టీలు. ర్యాలీలు, వర్చువల్ ప్రచారాలు, సంవాదాలు, వాగ్బాణాలు, ముందస్తు పోలింగ్.. ఇలా యూఎస్‌లో భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికల కోలాహలం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. ఇన్నాళ్లూ కొవిడ్ కట్టడిలో విజయవంతంగా పనిచేశామని చెప్పిన ట్రంప్.. ఇప్పుడు ఈ మహమ్మారి వల్లే సమస్యల్లో పడ్డారు. అధ్యక్షుడిగా ఆయన విశ్వసనీయతపైనే సందేహాలు ఏర్పడుతున్న పరిస్థితి.
మరోసారి అధ్యక్షుడి పీఠం దక్కాలంటే.. ట్రంప్‌కు ప్రజల మద్దతు చాలా కీలకం. కానీ, ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఆయనకే వైరస్ సోకటం, మరికొంత మంది నేతలు వైరస్‌బారిన పడటం, యూఎస్ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అయోమయంలో అమెరికన్లు..
అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యంపై ప్రజలకు వివరాలు తెలియకుండా ఉంచడం... శ్వేతసౌధానికి కొత్త చిక్కులు తీసుకువస్తోంది. ఆస్పత్రి వర్గాలు, అధికారులు, వైట్‌హౌస్ వెల్లడిస్తున్న వివరాలకు పొంతన లేకపోవటం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏ సమాచారం నమ్మాలో తేల్చుకోలేక అమెరికన్లు అయోమయానికి గురౌతున్నారు. ప్రభుత్వ ధోరణిపైనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: అధ్యక్షుడి ఆరోగ్యంపై ఎప్పుడూ అబద్ధాలే!
ట్రంప్ మొదటి నుంచీ వైరస్‌ను తక్కువ చేసి చూపించటం.. కరోనా ప్రబలిన తొలినాళ్లలో వేగంగా చర్యలేవీ చేపట్టకపోవటం.. పైగా ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను ఆయనే పాటించకపోవటం ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల విశ్వసనీయతపైనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రచారంపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుందంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా అమెరికన్లు... అధ్యక్షుడి పనితీరు, విశ్వసనీయతకు చాలా విలువనిస్తారు. రాజకీయ కారణాలతో అధ్యక్ష పీఠాన్ని తక్కువచేసే చర్యలను ప్రజలు తీవ్రంగా పరిగణిస్తారు. ప్రసుత్తం విపత్తులనామ సంవత్సరంగా మారిన 2020లో విశ్వసనీయత.. అధికారం ఒక్కసారికే పరిమితమవుతుందా ? మరోసారి అవకాశమిస్తుందా ? అనేది నిర్ణయిస్తుంది అంటున్నారు పరిశీలకులు.
మొదటి నుంచి ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు, విపరీత చర్యలు ఇప్పుడు చర్చకు వస్తాయని, ఎన్నికలకు ముందు ఇది చాలా చేటు చేస్తుందని చెబుతున్నారు.
ఆరోపణలపై అనుమానాలు
అలాగే, ట్రంప్ తన రాజకీయ ప్రత్యర్థులపై చేసే ఆరోపణల గురించి సైతం ప్రజలు ఆలోచిస్తారు. తాజాగా తన ప్రత్యర్థి బైడెన్.. డ్రగ్స్ తీసుకుంటున్నారని ఎటువంటి ఆధారాలు లేకుండానే తీవ్ర విమర్శలు చేశారు. అయితే, అన్నింటికీ మించి కరోనా మహమ్మారి ఆయన పాలనకు సంబంధించి అతిపెద్ద సవాల్‌గా నిలిచిందని విశ్లేషిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే ఆయన మొదటినుంచి కరోనా ప్రమాదకారి కాదంటూ... తేలికగా కొట్టిపారేస్తున్నారు. అమెరికన్లందరూ.. బ్లీచ్‌ను టీకాల రూపంలో తీసుకుంటే సరిపోతుందంటూ.. కరోనాపై హాస్యాస్పద, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కరోనా వైరస్ యూఎస్‌లో విజృంభించిన ఏప్రిల్ తొలినాళ్లలో 23శాతం అమెరికన్లు మాత్రమే... మహమ్మారిపై ట్రంప్ చెబుతున్న సమాచారం పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నామని వెల్లడించారు. ఇప్పుడు ఆ శాతం మరింత క్షీణించినట్లుగా అనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.
పంథా మార్చిన అధ్యక్షుడు
ఎన్నికల రోజు దగ్గరపడుతున్న వేళ పంథా మార్చారు ట్రంప్. మహమ్మారి చాలా తీవ్రమైనదని, సమర్థంగా ఎదుర్కోవటంలో ప్రభుత్వం విజయవంతమైందని చెబుతున్నారు. శాస్త్రవేత్తలతో సైతం ఇదే చెప్పిస్తున్నారు. ఇవన్నీ... ట్రంప్ విధానాలపై ప్రజల్లో మరింత విశ్వసనీయత కోల్పోయేలా చేశాయి.
గత కొన్ని వారాలుగా ట్రంప్.. అమెరికావ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. భారీ ర్యాలీలు చేపడుతున్నారు. వైట్‌హౌస్‌లోనే ఎటువంటి కరోనా నిబంధనలు పాటించకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ ప్రజలను ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి.
సుప్రీం కోర్టు కొత్త న్యాయమూర్తిని నియమిస్తూ.. భారీ కార్యక్రమం నిర్వహించిన తర్వాతే మెలానియా సహా, పలువురు సెనెటర్లకు వైరస్ సోకింది. ఇప్పుడు వారితో సహా అధ్యక్షుడు ట్రంప్.. అమెరికాలో వైరస్ సోకిన 76లక్షల మందిలో భాగమయ్యారు.
పొంతన లేని ప్రకటనలు
అధ్యక్షుడు ట్రంప్‌కు వైరస్ ఎలా సోకిందో.. ఎవరూ చెప్పటంలేదు. పాజిటివ్‌గా తేలిన తర్వాత.. చికిత్స మాత్రం అందిస్తున్నారు. స్వల్ప లక్షణాలు ఉన్నాయని మాత్రమే శ్వేతసౌధం వెల్లడించింది. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల చెబుతున్నాయి. కరోనా సోకిన తర్వాత 24 గంటల పాటు ముఖ్యమైన అవయవాలు కలవరపెట్టినట్లు సంబంధిత అధికారి వివరించారు. అయితే ఆసుపత్రి వర్గాలు మాత్రం భిన్నమైన కథనం వినిపిస్తున్నాయి. ట్రంప్ ఆసుపత్రిలో చేరిన తర్వాత గుండె, మూత్రపిండాలు, కాలేయం పనితీరు మెరుగుపడిందని, ఆయన కోలుకుంటున్నారని, జ్వరం గానీ, శ్వాస ఇబ్బందులు గానీ లేవని వైద్యులు చెబుతున్నారు. అధ్యక్షుడికి ముందుగా శ్వేతసౌధంలోనే చికిత్స అందించినా తర్వాత ప్రత్యేక హెలికాప్టర్‌లో వాల్టర్ రీడ్ సైనిక ఆసుపత్రికి తరలించారు. ట్రంప్ కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో స్పష్టంగా చెప్పలేమని, డిశ్ఛార్జి అయ్యేందుకు కొన్ని రోజుల సమయం తీసుకునే అవకాశాలు లేకపోలేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఆసుపత్రిలోని అధ్యక్ష కార్యాలయం నుంచే ట్రంప్ కొన్నాళ్లపాటు విధులు నిర్వర్తిస్తారని శ్వేతసౌధం ప్రకటించింది. తాను ఆరోగ్యంగానే ఉన్నానని అధ్యక్షుడు ట్విట్టర్లో 18 సెకెన్ల నిడివి ఉన్న వీడియో షేర్ చేశారు.
ఇలా.. పొంతనలేని, భిన్నమైన సమాచారం విభిన్న అధికార వర్గాల నుంచే వస్తుండటం అమెరికన్ పౌరులను కలవరపెడుతోంది. ఇలాంటి పరిస్థితిని ముందుగానే ట్రంప్ ప్రభుత్వం ఊహించకపోటం ఆశ్చర్యకరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తంగా.. ఇన్నాళ్లూ దేశంలో ఉన్న ఆరోగ్య సంక్షోభం కొలిక్కిరాకముందే.. శ్వేతసౌధంలో ఏర్పడ్డ విపత్తు ట్రంప్ మద్దతుదారులను కూడా ఆలోచనలో పడేస్తోంది. ట్రంప్ భవిష్యత్తు ప్రస్తుతం జబ్బుపడిన దశలో ఉందంటున్నారు పరిశీలకులు.
ఇదీ చూడండి: ట్రంప్ కోసం 'ఆపరేషన్ మాగా'- జోరుగా ప్రచారం