ETV Bharat / international

కరోనాను పసిగట్టడంలో అమెరికా విఫలం - అమెరికా కరోనా

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన, సంపన్నమైన దేశం అమెరికాలో కరోనా విజృంభిస్తోంది. దాదాపు రెండు లక్షలమందికి పైగా వైరస్​ బారిన పడ్డారు. వేల మందికి పైగా మరణించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో అందరి కంటే ముందున్న దేశం ఈ వైరస్​ను కట్టడి చేయడంలో ఎందుకు విఫలమైంది. అక్కడ పరిస్థితులు ప్రస్తుతం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

America fails to smell the corona and the detailed situtation of virus
కరోనాను పసిగట్టడంలో అమెరికా విఫలం
author img

By

Published : Apr 3, 2020, 6:06 AM IST

అమెరికాలో రెండులక్షల మందికిపైగా వైరస్‌ బారిన పడటం వల్ల ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన, సంపన్నమైన దేశం అమెరికా. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకుని జీవశాస్త్ర పరిశోధనల్లోనూ అందరికన్నా ముందున్న దేశమది. కొన్ని దశాబ్దాలుగా పెద్ద సంఖ్యలో భారతీయులు మెరుగైన జీవనం కోసం అమెరికాలో స్థిరపడ్డారు. అందులోనూ తెలుగువారు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. గుజరాతీల తరవాత తెలుగువారే అక్కడ ఎక్కువమంది ఉన్నారు. అందుకే అమెరికాలో చోటుచేసుకునే చిన్న పరిణామాలు సైతం ఇక్కడున్న తెలుగువాళ్లను ప్రభావితం చేస్తాయి.

తెలుగు ప్రసార మాధ్యమాల్లో సైతం అమెరికాలో వాతావరణ మార్పుల దగ్గర నుంచి సామాజిక అంశాల దాకా ప్రధానంగా ప్రస్తావిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలో ఒక్కసారిగా పెరుగుతున్న కరోనా వైరస్‌ కేసులపై ఇక్కడున్న తెలుగు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వైరస్‌ బాధితుల విషయంలో అమెరికా ఎందుకు సతమతమవుతోందో లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

వైరస్​ లక్షణాలను తొలిసారిగా గుర్తించిన ప్రదేశం

వుహాన్​ నగరంలో పుట్టిన ఈ వైరస్​ గురించి దాదాపు రెండు నెలలదాకా బయట ప్రపంచానికి పొక్కకుండా ఉండటానికి చైనా ప్రభుత్వ వైఖరే కారణమనే విమర్శలు ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. మూడు దశాబ్దాల నుంచి అమెరికా- చైనా వ్యాపార సంబంధాలు గణనీయంగా అభివృద్ధి చెందడమే కాకుండా మానవ వనరుల కదలికల్లో పెనుమార్పులొచ్చాయి. ప్రత్యేకించి అమెరికా పశ్చిమ తీరంతో చైనీయుల అనుబంధం ఎక్కువగా ఉంది. మొట్టమొదటగా జనవరి 21వ తేదీన వాషింగ్టన్‌ ప్రాంతంలోని స్నోకామీ కౌంటీలో ఒక వ్యక్తికి కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. అతడు జనవరి 15వ తేదీన చైనా నుంచి వచ్చాడు. వుహాన్‌ నగరంలో ఈ వైరస్‌ వ్యాప్తి గురించి ప్రపంచవ్యాప్తంగా వెల్లడి కావడంతో, తరవాత చైనా ప్రకటన చేసింది.

కొద్ది రోజులకు వుహాన్‌ నగరంలో లాక్‌డౌన్‌నూ ప్రకటించింది. కానీ, అత్యంత అధునాతన సమాచార వ్యవస్థ కలిగిన అమెరికా మేలుకోలేదు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. దురదృష్టవశాత్తు ప్రభుత్వం సమర్థ చర్యలు తీసుకోలేదు. వెంటనే చైనా నుంచి వచ్చే విమానాలను నిషేధించడం, వచ్చిన వారిని పూర్తి పర్యవేక్షణలో ఉంచడం లాంటి తక్షణ చర్యలు తీసుకోకపోవటం గమనార్హం. సమస్య అక్కడితో ఆగలేదు. ఈ నమూనాలను పరిశీలించే టెస్టింగ్‌ కిట్లు, ప్రయోగశాలల విషయంలో గందరగోళం నెలకొంది. జనవరిలోనే జర్మనీ పరిశోధకులు అభివృద్ధి చేసిన టెస్టింగ్‌ కిట్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించడంతో అన్ని దేశాలు అదే నమూనాను ఉపయోగించాయి.

దక్షిణ కొరియా వాటితోనే విస్తృతంగా పరీక్షలు చేపట్టింది. కానీ అమెరికా మాత్రం వాటిని ఉపయోగించటానికి ఒప్పుకోలేదు. అవి పూర్తిస్థాయిలో లోపరహితం కావనే నెపంతో సొంత నమూనాతో పనిచేసే కేంద్ర సంస్థ ఉన్న అట్లాంటాకి మాత్రమే పంపించారు. అక్కడ రోజుకు కొన్ని వేలు మాత్రమే పరీక్షించే సామర్థ్యం ఉంది. పైగా పరీక్ష ఫలితం రావడానికి కనీసం ఒకరోజు పడుతుంది. ఇలాంటి లోపభూయిష్ఠ వ్యవస్థ మూలంగా బయటి నుంచి వచ్చినవాళ్లలో ఎంతమందికి వైరస్‌ సోకింది, వాళ్లు ఎంతమందితో అనుసంధానమయ్యారనే విషయం తెలుసుకోవడం కష్టతరమైంది. ఈ తతంగం దాదాపు నెల రోజులు నడిచింది. ఫిబ్రవరి 29న మొదటి కరోనా మరణం సియాటిల్‌ శివారులో సంభవించడంతో అమెరికా మొత్తం ఉలిక్కిపడింది. అప్పటిదాకా ప్రభుత్వ చర్యలు నిమ్మకు నీరెత్తినట్లుగా సాగడంతో వైరస్‌ వ్యాప్తి చాపకింద నీరులా విస్తృతమైంది.

అదరాబాదరాగా ఏర్పాట్లు

ప్రస్తుతం రోజురోజుకీ వైరస్‌ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతూ ఉంది. కాకపోతే, వ్యాధి సోకిన వారిలో చనిపోతున్న వారి సంఖ్య విషయంలో అమెరికా పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది. ఇటలీలో 10 శాతం, స్పెయిన్‌లో 8 శాతం మంది మృత్యువాత పడితే అమెరికాలో అది 1.5 శాతంగా ఉంది. ఇది కొంతలోకొంత ఊరట కలిగించే విషయం. అయితే వాషింగ్టన్‌ యూనివర్సిటీ మెడిసిన్‌ స్కూల్‌ నిపుణుల అంచనా ప్రకారం- వైరస్‌ వ్యాప్తి ఉచ్ఛ దశ ఏప్రిల్‌ మధ్య దాకా ఉండొచ్చని, మొత్తం మృతులు 2.4లక్షల దాకా ఉండొచ్చని తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకునే చర్యల తీవ్రతను బట్టి ఈ సంఖ్య ఆధారపడి ఉంటుందని అంచనా వేసింది.

అమెరికా కాంగ్రెస్‌ ఆమోదంతో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. పాతకాలంనాటి రక్షణ ఉత్పత్తి చట్టాన్ని ప్రయోగించి జనరల్‌ మోటార్‌ కంపెనీ ద్వారా వెంటిలేటర్ల తయారీకి శ్రీకారం చుట్టారు. మాస్కులు, రక్షణ ముసుగులు యుద్ధ ప్రాతిపదికన తయారు చేయడంతోపాటు, దిగుమతి చేసుకుంటున్నారు. అవసరమైతే ఇతర దేశాలకు కూడా వెంటిలేటర్లు సరఫరా చేస్తామని ప్రకటించారు. కనీసం ఈ వేగంతో పని చేస్తేనైనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. దురదృష్టం ఏమిటంటే ఇప్పటికీ ట్రంప్‌, డెమోక్రాట్‌ గవర్నర్ల మధ్య బహిరంగంగా గొడవలు సాగుతూనే ఉన్నాయి. చివరకు లాక్‌డౌన్‌ విషయంలోనూ భేదాభిప్రాయాలున్నాయి. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ స్పందిస్తూ కనీసం ఆరు నుంచి పది వారాలు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటిస్తేనే ఈ విపత్కర పరిస్థితి నుంచి గట్టెక్కగలమని చెబుతున్నారు.

డెమోక్రాట్‌ నేత జో బైడెన్‌ దేశవ్యాప్త లాక్‌డౌన్‌ రెండు వారాలు సరిపోతుందని పేర్కొన్నారు. ఇంత జరిగినా ఇప్పటికీ ప్రజలు పూర్తిస్థాయిలో స్వీయ గృహనిర్బంధంలో లేరు. ఇంకా కొంత శాతం స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అదేమంటే ఆ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎక్కువ కేసులు లేవని ప్రభుత్వాలు చెబుతున్నాయి. నిపుణులు మాత్రం ఇదంతా ఇలాగే సాగితే మిగతా ప్రాంతాల్లోనూ న్యూయార్క్‌లాంటి పరిస్థితే తలెత్తుతుందని హెచ్చరిస్తున్నారు.

ఇక భారత్‌ విషయానికి వస్తే- అమెరికా అనుభవం చూసైనా మనం పాఠాలు నేర్వాలి. ముఖ్యంగా ప్రజలు ప్రభుత్వాలకు పూర్తి సహకారం అందించాలి. ఏదో ఒక మిషతో, గుంపులు గుంపులుగా ఒకచోట చేరితే అందరికీ చేటు చేసిన వారవుతారని గ్రహిస్తే మంచిది.

ఇదీ చూడండి : వైద్యుల సహృదయం.. రోగికి పుట్టినరోజు వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.