అమెరికాలో భారత నూతన రాయబారిగా బాధ్యతలు చేపట్టారు తరన్జీత్ సింగ్ సంధూ. అనంతరం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను శ్వేతసౌధంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అమెరికాలో భారత నూతన రాయబారికి ట్రంప్ ఘనస్వాగతం పలికారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో స్నేహాన్ని ట్రంప్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారని సమచారం. ఈ మేరకు భారత దౌత్య కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. భారత రాష్ట్రపతి, ప్రధాని తరపున అమెరికా అధ్యక్షుడికి సంధూ శుభాకాంక్షలు తెలిపినట్లు పేర్కొంది.
మోదీ, ట్రంప్‌ల వల్లే
గత మూడేళ్లలో ట్రంప్, మోదీల మార్గదర్శకాల వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉన్నత స్థాయికి చేరుకున్నట్లు తరన్జీత్ అభిప్రాయపడ్డారు. భారత్, అమెరికాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్ఠం చేయడానికి కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు.
అంతకుముందు తరన్జీత్కు స్వాగతం పలుకుతూ ట్వీట్ చేశారు అమెరికా అసిస్టెంట్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్(దక్షిణ, మధ్య ఆసియా) అలీస్ జీ వెల్స్.
"అమెరికాలో భారత నూతన రాయబారి తరన్జీత్ సంధుకు నా హృదయపూర్వక స్వాగతం. తరన్జీత్కు ఉన్న లోతైన అనుభవం భవిష్యత్తులో మా భాగస్వామ్యం కోసం ఉపయోగపడుతుంది. వాషింగ్టన్కు తిరిగి స్వాగతం."-స్టేట్ ఎస్సీఏ ట్వీట్
విశేషానుభవజ్ఞులు
అమెరికాతో వ్యవహారాలకు సంబంధించి అత్యంత అనుభవజ్ఞులైన భారత దౌత్యవేత్తలలో సంధూ ఒకరు. అమెరికాలో డిప్యూటీ దౌత్యాధికారిగా 2013 నుంచి 2017 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. 2005 నుంచి 2009 వరకు ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధిగా పనిచేశారు. అంతకుముందు 1997-2000 మధ్య వాషింగ్టన్‌లోని భారత దౌత్య కార్యాలయంలో తొలి కార్యదర్శి(రాజకీయ)గా విధులు నిర్వర్తించారు.
ఇదీ చదవండి: రైతులపై గ్రామస్థుల మూకదాడి.. ఒకరు మృతి