అమెరికాలోని అలబామా రాష్ట్రంలో పుట్టిన ఓ బాలుడు గిన్నిస్ రికార్డుల్లో స్థానం సంపాదించాడు. ఇందుకు కారణం ఆ చిన్నారి నెలలు నిండకుండా జన్మించడమే.
సాధారణంగా పిల్లలు ఎవరైనా 9 నెలలో పుడుతారు. కానీ కర్టస్ మీన్ అనే ఈ చిన్నారి మాత్రం 5 నెలలకే (Premature Baby) జన్మించాడు. నిర్ణీత సమయం కంటే ముందే పుట్టడం వల్ల బాలుడు సరిగ్గా అర కేజీ కూడా లేడు. ఈ సమయంలో చిన్నారికి సరైన వైద్యం అందించిన యూఏబీ ఆసుపత్రి సిబ్బంది ప్రాణాలను కాపాడారు.

"తొమ్మిదో నెల కంటే ముందే పుట్టిన చిన్నారులు చాలా మంది.. పురిటిలోనే చనిపోతారు. గణాంకాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఎందుకంటే వారిలో శరీర భాగాలు అప్పుడే పరిపక్వత చెందవు. అందుకే చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ కర్టస్ 5వ నెలకే జన్మించాడు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా బతికాడు."
డా. బ్రైయిన్ సిమ్స్, యూఏబీ ఆసుపత్రి
పుట్టినప్పుడు 420 గ్రాములు మాత్రమే ఉన్న కర్టస్.. రోజురోజుకు మరింత ఆరోగ్యవంతంగా అవుతున్నట్లు ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు.
"పుట్టిన నాటి నుంచి సుమారు 275 రోజుల పాటు చిన్నారికి చికిత్స అందించాం. అనేక వైద్య పరీక్షలు చేసిన తరువాత ఏప్రిల్‌లో డిశ్చార్జ్ చేశాం. ఆహారం, శ్వాస తీసుకోవడానికి చిన్నారి ఇబ్బంది పడుతున్నాడు. అందుకోసం నోరు, ముక్కు నుంచి ఆక్సిజన్‌ను, ఆహారాన్ని ఇచ్చేలా పైపులను అమర్చాం."
- ఆసుపత్రి సిబ్బంది
సాధారణంగా పిండం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడానికి 40 వారాల సమయం పడుతుంది. కానీ కర్టస్ తల్లి గర్భంలో కవలలు ఉండడం వల్ల 5వ నెలకే సర్జరీ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె యూఏబీ ఆసుపత్రిలో చేరింది. ప్రసవంలో ఇద్దరు పిల్లలు పుట్టారు. వారిలో ఒకరు కర్టస్ కాగా మరొకరు క్యాసియా. పుట్టిన ఒక రోజు తరువాత క్యాసియా చనిపోయింది. ఈ సమయంలోనే కర్టస్ను మూడు నెలల పాటు ఐసీయూలో ఉంచారు. ఈ సమయంలో చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుకుంటే ఏప్రిల్‌లో డిశ్చార్జ్ అయ్యాడు.

ప్రస్తుతం 16 నెలల ఉన్న కర్టస్.. పుట్టిన నాటి పరిస్థితితో పోల్చితే చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు సిమ్స్ చెప్పారు. ఇలా 5వ నెలలో పుట్టి ఇన్ని నెలలు బతికినందుకుగాను కర్టస్ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇంతకు ముందు ఈ ఘనత రిచర్డ్ హచిన్సన్ అనే బాలుని పేరిట ఉంది.
ఇదీ చూడండి: Raja Chari: రోదసిలోకి మన రాజాచారి!