అఫ్గానిస్థాన్ నుంచి నాటో బలగాలను ఉపసంహరించుకోవడాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ.బుష్ విమర్శించారు. ఇలా చేయడం వల్ల అక్కడి సామాన్య పౌరులను తాలిబాన్లకు బలిపశువులను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'అఫ్గాన్ మహిళలు, బాలికలు చెప్పలేనంత హానిని ఎదుర్కోబోతున్నారు. చంపడానికి వెనకాడని అత్యంత క్రూరమైన వ్యక్తుల చేతిలో వదిలివెళ్లడం కచ్చితంగా పొరపాటే. ఇది నా హృదయాన్ని ఎంతగానో కలచివేస్తోంది' అని జర్మనీ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ.బుష్ ఆవేదన వ్యక్తం చేశారు. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కూడా ఇదేవిధమైన అభిప్రాయం కలిగివున్నారని భావిస్తున్నానని బుష్ పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడిగా జార్జ్ డబ్ల్యూ.బుష్ ఉన్న కాలంలో.. 2001, సెప్టెంబర్ 11న న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. అనంతరం ఉగ్రసంస్థ అల్‌ఖైదా, తాలిబన్‌లను సమూలంగా అంతం చేసేందుకు అమెరికా, నాటో దళాలను అఫ్గానిస్థాన్‌కు పంపిచారు. ఇలా గడిచిన రెండు దశాబ్దాలుగా సాగిన యుద్ధం ఈ మధ్యే ముగిసింది. దీంతో అఫ్గాన్ నుంచి తమ బలగాలు ఈ ఏడాది సెప్టెంబర్ 11నాటికి పూర్తిగా విరమించుకోవాలని అమెరికా, నాటో దేశాలు నిర్ణయించాయి. అంతకుముందే అనగా.. జులై తొలివారం నాటికే ఈ ప్రక్రియను పూర్తిచేశాయి.
ఇలా అమెరికా, నాటో బలగాలు వెనుదిరగడంతో అఫ్గాన్‌లో మళ్లీ సంక్షోభం మొదలయ్యింది. గతంలో తమ స్థావరాలుగా ఉన్న ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు తాలిబాన్లు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఓపక్క ఉగ్రవాదులు, మరోవైపు తాలిబన్ల చర్యలతో అక్కడ చోటుచేసుకుంటున్న హింసాత్మక సంఘటనలపై తాజాగా ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి: తాలిబన్లతో అఫ్గాన్ ప్రభుత్వ చర్చలు- శాంతి నెలకొనేనా?