అమెరికా షికాగోలో తుపాకీ విష సంస్కృతి పెచ్చరిల్లిపోతోంది. దేశంలోని మూడో అతిపెద్ద నగరమైన షికాగోలో కార్మిక దినోత్సవ వారాంతంలో జరిగిన వేర్వేరు కాల్పుల ఘటనల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది.
తాజాగా జరిగిన కాల్పుల్లో ఓ 8 ఏళ్ల చిన్నారి కూడా మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. నగరంలోని దక్షిణ ప్రాంతంలో బాలిక వెళుతున్న ఎస్యూవీపై వెనక కారులో నుంచి కొంతమంది దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో చిన్నారితోపాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా బాలిక మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
ముఠా కక్షలే..
బాలికపై ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిగి ఉండకపోవచ్చని పోలీసులు వెల్లడించారు. స్థానిక ముఠా కక్షలే కారణమై ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ గుర్తించలేదు పోలీసులు.
చిన్నారులూ.. పోలీసులు..
అయితే, షికాగోలో హింసాత్మక నేరాలు భారీగా జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో మొత్తం 524 సార్లు హత్యా ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. జూన్ చివరి వారం నుంచి జరిగిన ఘటనల్లో 10 మంది చిన్నారులు/యువత చనిపోయినట్లు అంచనా. మరో 10 మంది పోలీసులనూ హత్య చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: అమెరికాలో కాల్పుల మోత.. నలుగురు మృతి