అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ బాల్య వివాహాలపై యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాల్య వధువుల్లో సగానికిపైగా భారత్ సహా ఐదు దేశాల్లోనే ఉన్నట్లు నివేదిక విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం బతికి ఉన్న 65 కోట్ల మంది బాలికలు, మహిళలకు చిన్నప్పుడే పెళ్లి జరిగినట్లు అంచనా వేయగా.. వారిలో భారత్, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఇథియోపియా, నైజీరియాలోనే సగానికిపైగా ఉన్నట్లు తెలిపింది.
భారత్‌కు సవాలే
కరోనా ప్రభావం కారణంగా 2030 నాటికి మరో కోటి బాల్య వివాహాలు జరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. పేదరికమే ఈ పరిస్థితికి కారణమని నివేదికలో యునిసెఫ్ పేర్కొంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే చట్టాలను సమర్థంగా అమలు చేయడం సహా పేదలకు సామాజిక భద్రత కల్పించేలా తక్షణమే చర్యలు చేపట్టాలని వివరించింది. దక్షిణాసియాలో బలీయమైన దేశంగా ఎదుగుతున్న భారత్‌కు బాల్య వివాహాలను అరికట్టడం పెద్ద సవాలుగా ఉందని యునిసెఫ్ తెలిపింది.
ఇదీ చూడండి: 'కరోనాతో మహిళల ఆదాయంపై ప్రతికూల ప్రభావం'