అమెరికాలో అత్యంత ధనికులైన 80 మంది మహిళల జాబితాను విడుదల చేసింది ప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజిన్. వీరిలో ముగ్గురు భారత సంతతి మహిళలు.
కంప్యూటర్ నెట్వర్కింగ్ దిగ్గజ సంస్థ 'అరిస్టా నెట్వర్క్స్' సీఈఓ జయశ్రీ ఉల్లాల్, ఐటీ కనసల్టింగ్ సంస్థ 'సింటెల్' సహ వ్యవస్థాపకులు నీర్జా సేఠి, స్ట్రీమింగ్ డేటా సంస్థ 'కాన్ప్లుయెంట్' సీటీఓ నేహా నర్ఖీద్ ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
'అమెరికాస్ రిచ్చెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్-2019' జాబితాలో ఆ దేశానికే చెందిన వ్యాపారవేత్త డయానీ హెండ్రిక్స్ మొదటి స్థానంలో నిలిచారు. ఇంటి పైకప్పు, కిటికీలకు వస్తువులను సరఫరా చేసే పేరుగాంచిన ఏబీసీ సంస్థకు ఆమె యజమాని. 72 ఏళ్ల డయానీ ఆస్తుల విలువ 700 కోట్ల డాలర్లు.
జయశ్రీ ఉల్లాల్‌కు జాబితాలో 18వ స్థానం దక్కింది. లండన్‌లో పుట్టి భారత్‌లో పెరిగిన ఆమె ఆస్తుల విలువ 140 కోట్ల డాలర్లు.
2వేల డాలర్ల పెట్టుబడితో 1 బిలయన్ డాలర్లు
నీర్జా సేఠికి 23వ స్థానం దక్కింది. 2వేల డాలర్లతో 1980లో ఆమె భర్తతో కలిసి సింటెల్ సహవ్యవస్థాపకులుగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం నీర్జా అస్తుల విలువ 100 కోట్ల డాలర్లు. 2018లో సింటెల్ సంస్థను ప్రెంచ్ ఐటీ కంపెనీ 3.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. తన వాటాగా దాదాపు 510 మిలియన్ డాలర్లు అందుకున్నారు నీర్జా.
360 మిలియన్ డాలర్లు విలువ చేసే అస్తులతో నర్ఖీద్కు 60వ స్థానం దక్కింది.
మహిళలు వ్యాపార రంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాణిస్తున్నారని ఫోర్బ్స్ తెలిపింది. ఎక్కువ మంది వినూత్న వ్యాపార ఆలోచనలతో దూసుకుపోతున్నారని పేర్కొంది.
జాబితాలో మొత్తం 80 మంది ఆస్తుల విలువ కలిపి 81.3 బిలియన్ డాలర్లు. కనీసం 225 మిలియన్ డాలర్లు విలువ చేసే ఆస్తులున్న వారే అర్హులు. జాబితాలో ఈ ఏడాది మొత్తం 25 మంది బిలయనీర్లున్నారు. గతేడాదితో పోల్చితే ఒకరు ఎక్కువ.
ఇదీ చూడండి: దుబాయ్‌లో 'రాంగ్ టర్న్'- మనోళ్లు 12 మంది మృతి