రసాయనశాస్త్రంలో విశేష సేవలందించిన ముగ్గురికి నోబెల్ పురస్కారం వరించింది. జాన్ బి గుడెనఫ్(యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్), ఎం స్టాన్లీ విట్టింగమ్(స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్), అకిరా యోషినో(జపాన్ మీజో యూనివర్సిటీ)కు ఈ పురస్కారాన్ని సంయుక్తంగా అందజేయనున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. 'లిథియం-అయాన్ బ్యాటరీ' అభివృద్ధికై ఈ ముగ్గురు చేసిన విశేష పరిశోధనలకు ప్రఖ్యాత పురస్కారం లభించింది.
గత రెండు రోజుల్లో 2019 ఏడాదికిగానూ వైద్య, భౌతికశాస్త్రాల్లో నోబెల్ విజేతలను ప్రకటించిన రాయల్ స్వీడిష్ అకాడమీ కమిటీ.. తాజాగా రసాయన శాస్త్రంలో గ్రహీతల పేర్లను వెల్లడించింది. జాన్ గుడెనఫ్ 97 ఏళ్ల వయసులో ఈ గౌరవాన్ని పొందడం విశేషం.
డిసెంబర్ 10న ప్రదానోత్సవం
నోబెల్ పురస్కారంగా 9 లక్షల 18 వేల డాలర్ల నగదు, పసిడి పతకం, ఒక ధ్రువపత్రం ఇవ్వనున్నారు. డైనమైట్ను కనుగొన్న 'నోబెల్'.. వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 10న అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, వైద్య, సాహిత్య రంగాల బహుమతులను స్టాక్హోమ్లో, నోబెల్ శాంతి బహుమతిని ఓస్లోలో ప్రదానం చేయనున్నారు.