అమెరికాలో కార్చిచ్చు అంతకంతకూ విస్తరిస్తోంది. ఉత్తర కాలిఫోర్నియాలో చెలరేగిన మంటలు ఓ పర్వతాన్ని కమ్మేయగా.. సమీపంలోని ఓ గ్రామం దగ్ధమైంది. ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వక్తం చేశారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రాష్ట్రానికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
- సియెర్రా నెవాడా ప్రాంతంలో గత రెండు రోజులుగా మంటలు అంతకంతకూ విజృంభిస్తున్నాయి. బెర్రీ క్రీక్ నగరం పూర్తిగా అగ్నిలో చిక్కుకుంది. రెండు రోజుల్లోనే అక్కడ 7 మృతదేహాలను గుర్తించగా.. మొత్తం మృతుల సంఖ్య 10కి చేరింది. తీవ్ర గాయాలపాలైన మరో నలుగురిని ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావించిన అధికారులు.. గల్లంతైన వారి కోసం ప్రత్యేక బృందంతో గాలిస్తున్నారు.
- శాన్ఫ్రాన్సిస్కోలో వారం రోజులుగా విస్తరించిన దావానలానికి సుమారు 2వేలకు పైగా ఇళ్లు, భవనాలు దహనమయ్యాయి. ఒరెగాన్ సరిహద్దు నుంచి ఉత్తర మెక్సికో ప్రాంతానికి సమీపంలోని సుమారు 29 పెద్ద అడవులు మంటల్లో చిక్కుకున్నాయి.
- ఒరెగాన్లో 3,625 చ.కి.మీ అడవి కాలిపోగా.. అక్కడ నివసించేవారిలో సుమారు 5లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటల్లో చిక్కుకుని ఇప్పటివరకు అక్కడ నలుగురు మరణించినట్లు సమాచారం. మూడురోజులుగా అక్కడ చెలరేగుతున్న కార్చిచ్చుతో సుమారు 9లక్షల ఎకరాల విస్తీర్ణంలోని అడవి దగ్ధమైంది.
- వాషింగ్టన్లో సుమారు 2,426 చదరపు కి.మీ అడవి దగ్ధమైంది. 9వేల మందిని ఇతర ప్రదేశాలకు తరలించారు. ఇప్పటివరకు ఒకరు మృతిచెందినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: హింసాత్మకంగా మారిన నిరసనలు.. ఏడుగురు మృతి