ఐరోపాకు వెళ్తున్న 11 మంది వలసదారులు లిబియా తీరంలో మరణించారు. వారు ప్రయాణిస్తున్న పడవ మధ్యధరా సముద్రంలో మునిగిపోయిందని అంతర్జాతీయ వలసవాద సంస్థ(ఐఓఎం) వెల్లడించింది. మృతిచెందినవారిలో ఓ గర్భిణీ సైతం ఉందని తెలిపింది.
పడవలో ప్రయాణిస్తున్న మరో 10 మందిని లిబియా తీర రక్షక దళం కాపాడిందని ఐఓఎం ప్రతినిధి సఫా మెహ్లీ పేర్కొన్నారు. ఇది.. వారం రోజుల వ్యవధిలో మధ్యధరా సముద్రంలో జరిగిన మూడో పడవ ప్రమాదమని తెలిపారు.
ఐఓఎం గణాంకాల ప్రకారం ఇప్పటివరకు ఈ ప్రాంతంలో 500 మంది వలసదారులు మరణించారు. మధ్యధరా సముద్రాన్ని దాటేందుకు ప్రయత్నించి దురదృష్టవశాత్తు వీరంతా తమ ప్రాణాలు కోల్పోయారు. అయితే మృతి చెందిన వారి సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుందని ఐఓఎం అంచనా వేస్తోంది. 2014 నుంచి కనీసం 20 వేల మంది ప్రజలు ఇక్కడ మరణించారని తెలిపింది.
ఇదీ చదవండి- 91 మంది శరణార్థులతో సముద్రంలో నౌక గల్లంతు