Oral Drug Covid: నోటి ద్వారా ఇచ్చే కొవిడ్-19 వ్యాక్సిన్ సిద్ధమవుతోంది. అమెరికా/ ఇజ్రాయెల్‌కు చెందిన ఔషధ కంపెనీ ఒరామెడ్‌కు అనుబంధ సంస్థ ఒరావ్యాక్స్ రూపొందించిన ఈ మందుపై దక్షిణాఫ్రికాలో మొదటి విడత క్లినికల్ ప్రయోగాలు మొదలయ్యాయి.
వ్యాక్సినేషన్ల ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీని సాధించడానికి దక్షిణాఫ్రికా తీవ్రస్థాయిలో శ్రమిస్తోంది. ఈ దేశంలో అనేక మంది టీకాల పట్ల విముఖత ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంజెక్షన్లకు తావులేని టీకా వల్ల వ్యాక్సినేషన్ సులువవుతుందని ఒరామెడ్ సీఈవో నాడవ్ కిడ్రోన్ తెలిపారు. ఇది వైరస్-లైక్ పార్టికిల్స్ (వీఎల్‌పీ) టీకా అని పేర్కొన్నారు.
గతంలో కొవిడ్ టీకా పొందనివారు, ఆ వ్యాధి బారినపడనివారిని తాజా క్లినికల్ ప్రయోగాల కోసం ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. రెండు డోసుల్లో దీన్ని ఇస్తామని, రెండింటి మధ్య మూడు వారాల విరామం ఉంటుందన్నారు. కరోనా వైరస్‌లోని మూడు రకాల ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకొని ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. ఉత్పరివర్తనకు పెద్దగా లోనుకాని ఒక ప్రొటీన్ కూడా ఇందులో ఉందన్నారు.
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పూనావాలా టీకా పరిశోధన కేంద్రం
poonawalla vaccine center in oxford: బ్రిటన్‌లోని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో త్వరలో పూనావాలా టీకా పరిశోధన కేంద్రం ఏర్పాటుకానుంది. భారత్‌లోని పూనావాలా కుటుంబానికి చెందిన సీరమ్ లైఫ్ సైన్సెస్ నుంచి అందే రూ.505 కోట్ల నిధులతో దాన్ని స్థాపించనున్నారు. ఇందులో 300 మందికి పైగా శాస్త్రవేత్తలు పనిచేస్తారని విశ్వవిద్యాలయం తెలిపింది. ప్రధానంగా నూతన టీకాల సత్వర అభివృద్ధే లక్ష్యంగా వారు కృషిచేస్తారని పేర్కొంది.
ఇదీ చూడండి: చైనాకు అమెరికా మరో ఝలక్- ఆ సంస్థలపై ఆంక్షలు