సుడాన్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. వరదల ధాటికి ఇప్పటివరకు వంద మంది మరణించగా.. 46మంది గాయపడ్డారు. లక్షకుపైగా ఇళ్లు కూలిపోగా... చాలా నగరాల్లో నీరు మోకాల్లోతులో ప్రవహిస్తోంది. అనేక ప్రాంతాల్లో మొసళ్లు, పాములు నీళల్లో తిరుగుతుండటం వల్ల సుడాన్‌వాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు.
వరదల వల్ల భారీగా ఆస్తి, పంట నష్టం సంభవించిందని సుడాన్ అధికారులు తెలిపారు. దేశాన్ని ప్రకృతి విపత్తు ప్రాంతంగా ప్రకటించిన అధికారులు.. మూడు నెలల అత్యవసర పరిస్థితిని విధించారు. వరదల వల్ల నైలు నది 17.5 మీటర్ల ఎత్తుకు చేరుకుందని.. శతాబ్దకాలంలో ఇదే అత్యధిక స్థాయని సుడన్ వ్యవసాయ శాఖ వెల్లడించింది. 5 లక్షల మందిపై వరదల ప్రభావం పడిందని.. లక్షల సంఖ్యలో నిరాశ్రయులను శిబిరాలకు తరలించామని అధికారులు తెలిపారు.
సుడాన్‌లో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురుస్తాయని.. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దిగజారనుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. సహాయ చర్యలు చేపట్టేందుకు నిధులు లేకపోవడం వల్ల తమకు సాయం చేయాలని సుడాన్ ప్రపంచ దేశాలను అభ్యర్థించింది.
ఇదీ చూడండి:- విచిత్ర వివాదం: నాది కాదంటే నాది కాదని గొడవ!