కరోనా భయంతో జనం ఇళ్ల నుంచి కాలు బయట పెట్టట్లేదు. కానీ, నెమళ్లు, జింకలు, వన్యప్రాణులు మాత్రం ఎంచక్కా రోడ్లపై తిరిగేస్తున్నాయి. లాక్‌డౌన్ కేవలం మనుషులకే.. మాకేం కాదు అన్నట్లు జంతువులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. తాజాగా దక్షిణాఫ్రికాలో ఉన్న క్రుగెర్ నేషనల్ పార్క్‌లోని సింహాలు రోడ్లపై సేదతీరుతున్న ఫొటోలను.. అధికారిక ట్విట్టర్లో షేర్ చేశారు అధికారులు.
ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. "సందర్శకులు లేకపోవడం వల్ల క్రుగెర్ నేషనల్ పార్క్‌లో ఉన్న కెంపైనా కాంట్రాక్చువల్ పార్క్‌లోని సింహాలు రోడ్లపై సేదతీరుతున్నాయి. సాధారణ రోజుల్లో ట్రాఫిక్ వల్ల సింహాలు ఇంత స్వేచ్ఛగా రోడ్లపైకి రావు. ప్రస్తుతం లాక్‌డౌన్ అమలులో ఉండటం వల్ల వాహనాల రాకపోకలు లేవు. ఈ నేపథ్యంలో ఇలా తమదైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాయి’’ అని జూ అధికారులు తెలిపారు.
లాక్‌డౌన్ వల్ల వన్య ప్రాణుల ప్రవర్తనలో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయని పార్క్ అధికారులు చెబుతున్నారు. వాతావరణంలోనూ కాలుష్య స్థాయిలు తగ్గినట్లు ఇప్పటికే పలు నివేదికలు వెల్లడించాయి.
ఇదీ చదవండి:లాక్‌డౌన్ ఉన్నా జల్లికట్టు ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు