ఉత్తర ఆఫ్రికాలోని టునీషియా తీర ప్రాంతంలో పడవ మునిగిన కారణంగా 39 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మంగళవారం ఉదయం జరిగింది. ప్రమాదం జరిగిన బోటులో 93 మంది ప్రయాణిస్తున్నారని టునీషియా అధికారులు వెల్లడించారు. దక్షిణ టునీషియాలోని ఎస్ఫ్యాక్స్ నగరంలోని పోర్టు పరిధిలో మృతదేహాలు లభ్యమయ్యాయని పేర్కొన్నారు. మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నారని తెలిపారు.
మరో బోటు కూడా..
అదే ప్రాంతంలో మరో పడవ ఇసుకలో కూరుకుపోయిందని అధికారులు వెల్లడించారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఈ రెండు పడవల నుంచి మొత్తం 165 మంది వలసదారులను రక్షించాయని పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని, గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు.
అదే కారణం..
వలసదారులలో అధిక శాతం మధ్య, దక్షిణ ఆఫ్రికా దేశాలకు చెందినవారని అధికారులు తెలిపారు. వీరు ఇటలీకి వలస వెళ్తున్నారని పేర్కొన్నారు. పడవల నాణ్యత లోపించడం, పరిమితికి మించి అందులో ప్రయాణించడం ఈ ప్రమాదాలకు కారణం అయి ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి : జర్నలిస్టులపై శానిటైజర్ కొట్టిన ప్రధాని