భాజపా నాయకులకు మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. హైదరాబాద్ ప్రజలు వరదలతో అల్లాడుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదని అన్నారు. సీఎం పెద్దమనసుతో రూ.పదివేల ఆర్థికసాయం అందిస్తుంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి అడ్డుకున్నారని విమర్శించారు. పటాన్చెరు డివిజన్లోని రామచంద్రాపురంలో తెరాస అభ్యర్థి తరఫున హరీశ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
గ్రేటర్లో ప్రచారానికి వస్తున్న కేంద్రమంత్రులు వరదసాయంతోనే హైదరాబాద్‌కు రావాలని ఆయన డిమాండ్ చేశారు. వరదలు వస్తే బెంగళూరు, గుజరాత్‌కు సాయం చేసిన కేంద్రం తెలంగాణకు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతోందని.. మతం పేరిట చిచ్చుపెట్టడం తప్ప దేశానికి చేసిందేమీ లేదన్నారు. ఓట్ల కోసం భాజపా, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేసే తెరాసకు ఓటు వేసి గెలిపించాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.