దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా కేజీయఫ్. దీనికి కొనసాగింపుగా రూపొందించిన కేజీయఫ్ ఛాప్టర్ 2 ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిపై సినీ అభిమానులు భారీగా అంచనాలు పెంచుకున్నారు. ఇప్పటికే ధియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభమైయాయి. కేజీయఫ్ 2లో రాకీభాయ్ పాత్రలో అమితాబచ్చన్ హావభావాలు కనిపిస్తున్నాయి. వాటిని ప్రేరణగా తీసుకున్నారా ? భవిష్యత్తులో ఆయన సినిమాల రీమేక్ చేస్తారా ? అంటూ ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో వేసిన ప్రశ్నలకు యశ్ ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. 'వ్యక్తిగతంగా నేను రీమేక్ సినిమాలు చేయడానికి అంతగా ఇష్టపడను. అందులో అమితాబచ్చన్ లాంటి గొప్ప నటుడి సినిమాలను రీమేక్ చేయలన్న ఆలోచన కూడా చేయలేను. చేస్తానని మీరెప్పడూ అనుకోకండి.' అని యశ్ సమాధానం చెప్పాడు.
కేజీయఫ్ 2లో రాకీభాయ్ పాత్ర చూస్తూంటే షాహెన్‌షా, అగ్నిపథ్, డాన్, దీవార్ వంటి క్లాసిక్ చిత్రాలలో 'యాంగ్రీ యంగ్ మ్యాన్'గా కనిపించిన అమితాబచ్చన్ గుర్తొస్తున్నారు. ఈ పాత్ర వాటి నుంచి ప్రేరణ పొందిందేనా అన్న ప్రశ్నకు 'హీరోయిజం ఎలా ఉండాలి. హీరోను అభిమానులు ఎలా ఆరాధిస్తారు. మొదలైనవి అమితాబ్ నుంచి ప్రేరణగా తీసుకున్నాను. అయితే దీనికి ఏ సినిమాతో సంబంధం లేదు. కానీ, అమితాబ్ చేసే సినిమాల సారాంశం ఒక్కటే యావత్ భారతదేశం ఏమి చూడాలనుకుంటుందో దానిని ఆయన సినిమాల్లో చూపిస్తారు.' అంటూ చెప్పుకొచ్చారు ఈ కన్నడ స్టార్.
యశ్ 'రాకీభాయ్'గా అలరించనున్న ఈ సినిమాలో సంజయ్‌దత్, రవీనాటాండన్, ప్రకాష్‌రాజ్, శ్రీనిధి శెట్టి కీలకపాత్రలు పోషించారు. ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని హోంబళే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కన్నడతోపాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో సందడి చేయడానికి కేజీయఫ్ 2 సిద్ధమైంది.