Vivek oberoi Kaduva movie: అవకాశం వస్తే తప్పకుండా పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రంలో తాను నటించాలనుకుంటున్నానని అన్నారు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్. సినిమా పట్ల తెలుగు ప్రేక్షకులు చూపించే ప్రేమ దేశంలో మరెక్కడా దొరకదని పేర్కొన్నారు. 'రక్త చరిత్ర' విడుదల సమయంలో చోటుచేసుకున్న ఓ ఘటన తాను ఎప్పటికీ మర్చిపోనని తెలిపారు. ప్రస్తుతం వివేక్ మలయాళీ సినిమా 'కడువా'లో నటించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన 'కడువా' ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న వివేక్.. 'రక్తచరిత్ర' రోజుల్ని గుర్తు చేసుకున్నారు.
"రక్తచరిత్రతో నేను దక్షిణాది చిత్రాల్లోకి ఎంట్రీ ఇచ్చా. పరిటాల రవి లాంటి పవర్‌ఫుల్, అత్యద్భుతమైన రోల్‌లో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. ఆ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లోని రియల్ ఫ్యాక్షనిజం తీవ్రత తెలుసుకున్నా. ఆ సినిమా విడుదలైనప్పుడు దాన్ని చూసేందుకు హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌కు వెళ్లా. సినిమాలో సాధారణ స్కూటర్‌పై నా ఎంట్రీ సీన్ ఉంటుంది. ఆ సీన్ చూసి థియేటర్‌లో ప్రేక్షకులందరూ ఈలలు వేసి.. గోల చేశారు. ఆ క్షణం వాళ్లు చూపించిన ఉత్సాహం చూస్తే ముచ్చటగా అనిపించింది. ఆ ఘటన ఎప్పటికీ మర్చిపోను. అప్పుడు అర్థమైంది.. సినిమాపట్ల తెలుగువారికి ఉన్న ప్రేమాభిమానం దేశంలో మరెక్కడా కనిపించదు" అని వివేక్ తెలిపారు.
బాలీవుడ్‌లో తెరకెక్కిన విభిన్న కథా చిత్రాల్లో నటించి మెప్పించిన వివేక్.. ఆర్జీవీ రూపొందించిన 'రక్త చరిత్ర'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. పరిటాల రవి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమాలో వివేక్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. 'రక్తచరిత్ర', 'రక్తచరిత్ర-2' విడుదలైన సుమారు తొమ్మిదేళ్ల తర్వాత 2017లో ఆయన మళ్లీ 'వినయ విధేయ రామ'తో తెలుగుతెరపై కనిపించారు.
ఇదీ చూడండి: ఆ షార్ట్‌ఫిల్మ్‌కు 513 అవార్డులు.. గిన్నిస్‌లో చోటు