Vin Diesel Accused Of Sexual Assault : 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' సిరీస్‌ల హీరో విన్ డీజిల్‌పై లైంగిక ఆరోపణల కేసు నమోదైంది. అతడి మాజీ సహాయకురాలు జొనాసన్ విన్‌డీజిల్ పై ఈ సంచలన ఆరోపణలు చేశారు. 2010లో 'ఫాస్ట్ ఫైవ్' సినిమా చిత్రీకరణ సయమంలో ఓ హోటల్ గదిలో ఈ ఘటన జరిగిందని ఆమె ఆరోపించారు. ఈ మేరకు లాస్ ఏంజెల్స్ కోర్టులో గురువారం వ్యాజ్యం దాఖలైంది.
2010లో 'ఫాస్ట్ ఫైవ్' చిత్రానికి గాను విన్ డీజిల్ అసిస్టెంట్‌గా పని చేశారు జొనాసన్. అయితే చిత్రీకరణలో భాగంగా యూనిట్ కలిసి అట్లాంటా వెళ్లినట్లు జొనాసన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హోటల్ గదిలో తన అనుమతి లేకుండా విన్ డీజిల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తెలిపారు. ఇదే విషయాన్ని విన్ డీజిల్ సోదరి సమంతా విన్సెంట్‌కు చెప్పినప్పటికీ ఆమె పట్టించుకోలేదన్నారు. ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే తనను ఉద్యోగం నుంచి తొలగించేశారంటూ ఆ స్టేట్మెంట్లో పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా పేరున్న నటుడికి వ్యతిరేకంగా మాట్లాడితే పరిశ్రమ నుంచి వెలివేస్తారనే భయంతోనే ఆమె ఇంతకాలం మౌనంగా ఉండిపోయిందంటూ జొనాసన్ తరపు న్యాయవాది వ్యాజ్యంలో పేర్కొన్నారు. "విన్ డీజిల్ ప్రవర్తనను ధైర్యంగా వ్యతిరేకించినందుకు జొనాసన్ ఉద్యోగాన్ని కోల్పోయారు. అతడి వేధింపులను దాచి పెట్టే ప్రయత్నాలు జరిగాయి. బలవంతులకు రక్షణ కల్పిస్తే పోతే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు ఎన్నటికీ ఆగవు. తన వేదనను బయటకు చెప్పేందుకు ఆమె తీసుకున్న ఈ నిర్ణయం మార్పును తీసుకువస్తుందని ఆశిస్తున్నాం." అని జొనాసన్ తరఫు న్యాయవాది ఆ వ్యాజ్యంలో పేర్కొన్నారు.
సమంత విన్సెంట్ ఆధ్వర్యంలో నడుస్తోన్న వన్ రేస్ సంస్థ ద్వారానే జొనాసన్కు ఉద్యోగం వచ్చింది. విన్ డీజిల్ సహాయకురాలిగా ఫాస్ట్ ఫైవ్ టీమ్‌తో అట్లాంటాకు వెళ్లడమే ఆమెకు అప్పగించిన మొదటి వర్క్. 'ఫాస్ట్ అండ్ ప్యూరియస్' సిరీస్‌లతోనే విన్ డిజీల్ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. 2017లో 'త్రిబుల్ ఎక్స్: ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్' చిత్రంలో విన్ డీజిల్‌కు జోడీగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణె నటించారు. ఆ చిత్రంతో విన్ డీజిల్ ఇండియాలో మరింత పాపులర్ అయ్యారు.