టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గ్యారేజ్‌లో అద్భుతమైన ఫీచర్స్ కలిగిన ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు వాటిలోకి మరో కొత్త కారు చేరింది. అదే అత్యాధునిక టెక్నాలజీ కలిగిన లగ్జరీ కారు టొయోటా వెల్‌ఫైర్. రీసెంట్‌గానే ఆయన ఈ కారును కొన్నట్లు సమాచారం. ఎంతో హుందాగా ఉండే ఈ కారు విలువ సుమారు 1.9 కోట్ల రూపాయలట.
బ్లాక్ కలర్‌లో ఉన్న ఈ కారు రిజిస్ట్రేషన్ కోసం చిరంజీవి మంగళవారం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి.. కొణిదెల చిరంజీవి అనే పేరుతో వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారట. రూ.4.70 లక్షలు పెట్టి ఆ వాహనానికి ఆయన TS09GB1111 అనే నంబర్‌ను తీసుకున్నారట. ఈ మేరకు ఆర్టీఏ ఆఫీసులో ఫొటో, డిజిటల్ సంతకం తదితర ప్రక్రియను పూర్తి చేశారట. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
టయోటా వెల్‌ఫైర్ ప్రత్యేకత
చిరంజీవి కొన్న టయోటా వెల్‌ఫైర్ వాహనం విషయానికి వస్తే ఆ కారులో మూడు వరుసలు ఉంటాయి. ఏడుగురు దర్జాగా కూర్చొని షికారుకు వెళ్లవచ్చు! భద్రత కోసం ఏడు ఎయిర్ బ్యాగ్స్ ఉండటం విశేషం. ఎలక్ట్రిక్ స్లైడింగ్ డోర్స్ మరో ప్రత్యేకత. ట్విన్ సన్‌రూఫ్, 13 అంగుళాల ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్స్ వంటి మరిన్ని స్పెషాలిటీస్ ఈ వాహనం సొంతం.
కాగా, చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో చిరు చెల్లిగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. అయితే అప్పట్లో ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే చిరంజీవి.. ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆచార్య సినిమాతో ఫ్లాప్ అందుకున్న చిరు.. వీరయ్యతో సూపర్ హిట్ సాధించారు.
రజనీని డైరెక్ట్ చేయనున్న బాబీ!
చిరంజీవికి వాల్తేర్ వీరయ్యలాంటి సూపర్ డూపర్ హిట్ అందించిన దర్శకుడు బాబీ కొల్లి.. రజనీకాంత్ మూవీతో కోలీవుడ్‌లోనూ అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే ఆయన ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ తయారు చేసినట్లు సమాచారం. ఆ స్క్రిప్ట్‌ను త్వరలోనే రజనీకాంత్ ముందు బాబీ పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే బయటకు రానుంది. ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారట.