Gopichand Ramabanam Movie Review : సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబోలు ప్రేక్షకుల్లో తెగ ఆసక్తిని రేకెత్తిస్తాయి. గోపీచంద్ - శ్రీవాస్ కలయిక కూడా అలాంటిదే. 'లక్ష్యం', 'లౌక్యం' తర్వాత ఈ స్టార్ కాంబో కలవడమే ఆ అంచనాలకు కారణం. ఎన్నో హిట్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చిన ఆ కలయికలో రూపొందిన మూడో చిత్రం 'రామబాణం'. ఈ సినిమా మొదటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేసింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే..
స్టోరీ ఏంటంటే.. రాజారామ్ (జగపతిబాబు) తన ఊరిలో సుఖీభవ అనే పేరుతో ఓ హోటల్‌ను నడుపుతుంటాడు. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని భావించే ఆయన.. సంప్రదాయ వంటకాల్ని తయారు చేయిస్తూ తక్కువ ధరలకే అందుబాటులో ఉంచుతుంటాడు. వ్యాపారంలో పోటీదారులకు అది కంటగింపుగా మారుతుంది. దీంతో జీకే (తరుణ్ అరోరా), అతని మామ (నాజర్) సుఖీభవ హోటల్‌పై దౌర్జన్యానికి పాల్పడి లైసెన్స్‌ను తీసుకెళ్లిపోతారు. ఇక రాజారామ్ తమ్ముడైన విక్కీ (గోపీచంద్) రాత్రికి రాత్రే వాళ్ల ఇంటిపై దాడిచేసి లైసెన్స్‌ను తిరిగి తీసుకొస్తాడు. అయితే నీతి నిజాయతీగా మెలిగే రాజారామ్ ఏదైనా సరే చట్ట పరిధిలోనే చేయాలని భావిస్తుంటాడు. దీంతో తన తమ్ముడు విక్కీ చేసిన పని నచ్చని రాజారామ్.. ఇలాంటివి చేస్తే జీవితంలో ఉన్నతంగా ఎదగలేమని చెబుతూ అతన్ని పోలీసులకు అప్పజెప్పేందుకు బయలదేరతాడు. ఇంతలో విక్కీ తాను ఎప్పటికైనా ఉన్నతంగా ఎదిగి తిరిగొస్తానంటూ తప్పించుకుని కోల్‌కతా వెళ్లిపోతాడు. అక్కడికి వెళ్లిన విక్కీ ఏం చేశాడు? పదిహేనేళ్ల తర్వాత తిరిగి రావల్సిన అవసరం ఆయనకు ఎందుకొచ్చింది? తిరిగి వచ్చాక ఏం జరిగిందనేదే అసలు కథ.
ఎలా ఉందంటే:
Gopichand movie Ramabanam Review : పాత కథల్ని కూడా కొత్తగా చెబుతున్న ట్రెండ్ ఇది. స్టోరీ అదే అయినా కూడా దానికి కొత్త నేపథ్యాల్ని మేళవించి, విభిన్నమైన పాత్రీకరణలతోనూ, కథనాలతోనూ మేజిక్ చేస్తూ ఇప్పటి ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కుటుంబ కథలు ఇప్పుడు రావడం లేదు కదా అని.. దశాబ్దాల కిందటే చూసేసిన కథల్ని అదే ఫార్ములాతో ఇప్పుడు తెరపైకి తీసుకొస్తామంటే కుదరని పని. కానీ, రామబాణం విషయంలోనూ జరిగింది అదే.
సేంద్రియ ఉత్పత్తులు, సంప్రదాయ ఆహారం అంటూ ఓ కొత్త నేపథ్యాన్ని ఎంచుకున్నారు. తగిన తారాగణం, కావల్సినంత బడ్జెట్ ఉందని తెరపైన హంగులే చెబుతున్నాయి. కానీ సినిమాను మలిచిన విధానం మాత్రం పేలవంగా ఉంది. మొదటి నుంచి చివరి వరకు ఒక్క సన్నివేశంలోనూ కొత్తదనం కనపడలేదు. ప్రేమ, కుటుంబ అనుబంధాలు, డ్రామా, ఆలోచన రేకెత్తించగలిగే నేపథ్యం.. ఇలా అన్నీ ఉన్న కథే అది. అయినప్పటికీ మనసుల్ని హత్తుకునే భావోద్వేగాలు కానీ, కాసింత హాస్యం పంచే సన్నివేశాలు కానీ మచ్చుకైనా కనిపించవంటే ఈ స్క్రిప్ట్, దర్శకత్వం ఎంత పేలవమో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు.
కథానాయకుడు కోల్‌కతా నుంచి ఫ్లైటెక్కి సొంత కుటుంబాన్ని కలవడం కోసం బయల్దేరడంతో కథ ఆరంభమవుతుంది. హీరో ఫ్లాష్‌బ్యాక్, కోల్‌కతా జీవితం, అక్కడ విక్కీ భాయ్‌గా ఎదగడం వంటి సన్నివేశాలతోనే సినిమా సాగుతుంది. యూట్యూబర్ భైరవి (డింపుల్ హయాతి)తో ప్రేమలో పడటం వల్ల స్టోరీలో ట్విస్ట్ వస్తుంది. హీరో పదిహేనేళ్ల తర్వాత తిరిగి సొంత కుటుంబానికి దగ్గర కావడం, ఈ క్రమంలో అక్కడ చోటు చేసుకునే పరిణామాలు అన్నీ ప్రేక్షకుడి ఊహకు అందేవే. కొన్నయితే మరీ అతిగా అనిపిస్తాయి. కథానాయకుడు ఫోన్‌లోనే రూ.50 కోట్లు సర్దుబాటు చేసి పెళ్లికి ఒప్పించే సన్నివేశాలు అలాంటివే. కామెడీ కోసమంటూ వెన్నెల కిశోర్‌ను మ్యూజిక్ టీచర్‌గా చూపిస్తూ తీర్చిదిద్దిన సన్నివేశాల్లో ఏమాత్రం కొత్తదనం కనిపించలేదు. ఆ సన్నివేశాలన్నీ ఆడియన్స్‌ను పెద్దగా నవ్వించవు. పతాక సన్నివేశాలైతే కొద్దిలో కొద్దిగా నయమన్నట్లు ఉన్నాయి. అన్నదమ్ములిద్దరి అభిప్రాయాలూ కలవడం, ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు మాస్ ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. సేంద్రీయ ఆహార ఉత్పత్తుల గురించి కోర్టులో జరిగే వాదనలు, న్యాయమూర్తి చెప్పే మాటలు, సందేశం మెప్పిస్తాయి.
ఎవరెలా చేశారంటే: సినిమాలో గోపీచంద్ స్టైలిష్ లుక్ బాగుంది. ఓ వైపు స్టైల్‌గా కనిపిస్తూ, యాక్షన్ ఘట్టాల్లోనూ, పాటలతోనూ మెప్పించాడు. కానీ ఆయన పాత్రలో ఏమాత్రం కొత్తదనం కనిపించలేదు. ఇక జపగతిబాబును ఈ మధ్య ప్రతినాయకుడిగానే ఎక్కువగా చూస్తున్నాం. కానీ ఇందులో సాత్వికంగా కనిపిస్తూ రాజారామ్ పాత్రలో ఒదిగిపోయారు. ఆయన పాత్రని మలిచిన తీరు బాగుంది. డింపుల్ హయాతి పాటలకే పరిమితమయ్యారు. డ్యాన్స్‌లు బాగా చేశారు. ఖుష్బూ పాత్ర పరిధి మేరకు నటించారు.
అలీ, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను, సప్తగిరి గ్యాంగ్ చేసిన హంగామా ఏమాత్రం నవ్వించదు. తరుణ్ అరోరా, నాజర్, రాజా రవీంద్రతోపాటు కోల్‌కతా విలన్లు తదితరులు అలవాటైన పాత్రల్లోనే కనిపించారు. కోల్‌కతా రౌడీలు, లోకల్ రౌడీలు ఇలా బోలెడంత విలన్ గ్యాంగ్ ఉన్నా ఆ పాత్రలన్నీ అంతంతమాత్రంగానే ఉన్నాయి. దాంతో హీరోయిజం కూడా పెద్దగా పండలేదు. సాంకేతికంగా సంగీతం, కెమెరా, కళ విభాగాల పనితీరు మెప్పిస్తుంది. కొన్ని సన్నివేశాలు రిచ్‌గా కనిపించాయి. 'సాక్ష్యం' తర్వాత సుదీర్ఘమైన విరామం తీసుకుని ఈ సినిమా చేసిన దర్శకుడు శ్రీవాస్ తన పనితీరుతో ప్రభావం చూపించలేకపోయారు. పాత కథను, అంతే మూస పద్ధతుల్లో చెప్పారు. నిర్మాణం ఉన్నతంగా ఉంది.
- బలాలు
- + పతాక సన్నివేశాలు
- + సంప్రదాయ ఆహార నేపథ్యం
- బలహీనతలు
- - కొత్తదనం లేని కథ, కథనాలు
- - ఆసక్తి రేకెత్తించని సన్నివేశాలు
చివరిగా: ఈ 'రామబాణం' గురితప్పింది!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!