టాలీవుడ్ సినీ పరిశ్రమలో మరో విషాదం జరిగింది. తెలుగు సినీ ప్రేక్షకులకు మరుపురాని పాటలను అందించిన సంగీత ద్వయం రాజ్-కోటి. సంగీత ప్రపంచంలో రాజ్-కోటి ద్వయం ప్రఖ్యాతిగాంచింది. దశాబ్దాలపాటు సినీప్రియులను తమ సంగీతంతో అలరించింది. అయితే ఇప్పుడా ద్వయంలో రాజ్(68) ఆదివారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తాజాగా గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. రాజ్ మరణంతో చిత్రపరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణం సంగీత ప్రియులకు తీరని లోటుని మిగిల్చింది. పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. రాజ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
ఎవర్గ్రీన్ సాంగ్స్.. నంది పురస్కారం.. రాజ్-కోటి ద్వయం విషయానికొస్తే.. ప్రళయ గర్జన చిత్రంతో సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించిన వీరిద్దరూ ఎన్నో ఎవర్గ్రీన్ హిట్ సాంగ్స్‌ను అందించారు. అలా వీరిద్దరు కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించారు. దాదాపు 150కు పైగా చిత్రాలకు వీరిద్దరు కలిసి పనిచేశారు. 3వేలకుపైగా పాటలకు స్వరాలు సమకూర్చారు. అందులో దాదాపు 2500 పాటలకు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, కె.ఎస్.చిత్ర పాడారు. 'లేడీ జేమ్స్‌బాండ్', 'ఉక్కు సంకెళ్లు', 'పున్నమి రాత్రి', 'మధన గోపాళుడు', 'యముడికి మొగుడు', 'లంకేశ్వరుడు', 'బాలగోపాలుడు', 'బంగారు బుల్లోడు', 'అన్న తమ్ముడు, 'ముఠామేస్త్రి', 'బావా బావమరిది', 'గోవిందా గోవిందా', 'హలోబ్రదర్' వంటి చిత్రాలు ఈ రాజ్-కోటికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. హలో బద్రర్ సినిమాకు నంది పురస్కారం అందుకున్నారు. వీరిద్దరి దగ్గర ప్రముఖ దర్శకుడు ఏఆర్. రెహ్మాన్ కూడా కీబోర్డు ప్రోగ్రామర్‌గా కొన్నాళ్ల పాటు పనిచేశారు. రెహ్మాన్.. ఎప్పుడూ ఈ ద్వయాన్ని తన సోదరులని చెప్పేవారు.
అనుకోని కారణలతో విడిపోయి.. అయితే వీరిద్దరి ప్రయాణం సాఫీగా సాగుతున్న వేళ.. అనుకోని కారణాల వల్ల కోటి- రాజ్ విడిపోయారు. అనంతరం.. రాజ్ సొంతంగా కొన్ని చిత్రాలకు సంగీతం అందించారు. 'సిసింద్రీ', 'రాముడొచ్చాడు', 'ప్రేమంటే ఇదేరా' (బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) ఇలా పలు సినిమాలకు ఆయన మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. కొన్ని చిత్రాల్లోనూ ఆయన అతిథి పాత్రల్లోనూ కనిపించారు.
కాగా, రాజ్ అసలు పేరు తోటకూర సోమరాజు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రాజ్ తండ్రి తోటకూర వెంకట రాజు కూడా సంగీత దర్శకులే. పలు తెలుగు చిత్రాలకు ఆయన పనిచేశారు. అలనాటి నటుడు ఎన్టీఆర్ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో.. మద్రాసులో ఇద్దరూ కలిసే ఉండేవారు.
ఎప్పటికీ బతికే ఉంటారు.. తన ప్రాణ స్నేహితుడు, సోదర సమానుడైన రాజ్ మరణించిన వార్త తెలుసుకున్న సంగీత దర్శకుడు కోటి ఎమోషనల్ అయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. రాజ్ కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు. "నేను ప్రస్తుతం చెన్నైలో ఉన్నాను. నా రాజ్ మరణించారనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. ఈ మధ్యే ఓ సినిమా ఫంక్షన్‌లో కూడా కలుసుకున్నాం. ఆయనకు ఆరోగ్య సమస్యలున్నట్టుగా నాకేమీ అనిపించలేదు. రాజ్ కూడా నాకేమీ చెప్పలేదు. ఇప్పుడు గుండెపోటుతో ఆయన మరణించారని తెలిసి చాలా బాధ అనిపిస్తోంది. రాజ్ కోటిగా మేమిద్దరం ఎన్నో సినిమాలకు కలిసి పని చేశాము. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించాం. మేం ఇద్దరం విడిపోయిన తర్వాత నేను ఎన్ని సినిమాలు చేసినా.. వాటిని కూడా రాజ్-కోటి పాటలనే అనేవారు. మేమిద్దం ఇరవై నాలుగు గంటలూ పని చేసేవాళ్లం. చక్రవర్తి దగ్గర మేం ఇద్దరం అసిస్టెంట్లుగా పని చేశాం. 'ముఠామేస్త్రి', 'హలోబ్రదర్' ఇలా ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాం. మేం ఇద్దరం తెలుగులో ఓ ట్రెండ్‌ను సెట్ చేశారం. ఈ రోజు నా రాజ్ లేడంటే చాలా బాధగా ఉంది. మా పాటల రూపంలో రాజ్ ఎప్పటికీ కలకాలం ఉంటారు. కాల ప్రభావం, పరిస్థితుల వల్ల మేం విడిపోవాల్సి వచ్చింది. నేను ఎన్ని సినిమాలు చేసినా కూడా రాజ్ నా పక్కన ఉన్నాడనే ధైర్యంతోనే చేయగలిగాను. రాజ్‌కు నేను ఒక తమ్ముడి లాంటివాడిని. చిన్ననాటి స్నేహితులం. మేం ఇద్దరం విడిపోవడం నాకు ఇప్పటికీ బాధగానే ఉంటుంది. కానీ అప్పటి పరిస్థితుల వల్ల విడిపోవాల్సి వచ్చింది. మా పాటల రూపంలో రాజ్ ఎప్పటికీ బతికే ఉంటాడు" అంటూ కోటి భావోద్వేగం అయ్యారు.
ఇదీ చూడండి: రీరిలీజ్‌లో 'సింహాద్రి' ఆల్‌టైమ్ రికార్డ్.. ఫస్ట్ డే సూపర్ కలెక్షన్స్!