ఒకే నేపథ్యంపై పలు సినిమాలు రావడం సహజం. అలాగని ఒకే సమయంలో వస్తే వాటి ఫలితం ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే. కొవిడ్ కారణంగా దాదాపు రెండేళ్లు పలు సినిమాలు వాయిదా పడడంతో 2022లో సినిమాలు క్యూ కట్టాయి. కొన్ని రోజుల తేడాతో బాలీవుడ్‌లో ఒకే జోనర్‌లో రెండేసి చిత్రాలు వస్తున్నాయి. వాటి విశేషాలేంటో చూద్దామా?
ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి దర్శకులు అప్పుడప్పుడూ కొత్త ఆలోచనలతో ముందుకొస్తారు. ఈ ఏడాదీ అలాంటి ప్రయత్నమే ఒకటి జరుగుతోంది. దేశంలో ఇప్పటికీ బహిరంగంగా చర్చించలేని అంశం కండోమ్. అబ్బాయిలే వీటిని ప్రస్తావించరు. అదే అమ్మాయి వీటిని అమ్మితే..? మరో యువతి పరీక్షలు చేస్తే..? ఈ అంశాలనే వినోదాత్మకంగా చెబుతూ రెండు సినిమాలు రానున్నాయి.
కండోమ్ కంపెనీకి సేల్స్‌గర్ల్‌గా పనిచేసే యువతికి ఎదురయ్యే సంఘటనల సమాహారమే 'జన్ హిత్ మే జారీ'. ప్రధాన పాత్రలో నుస్రత్ భరూచ్ నటించింది. ఈ వృత్తిలో ఉంటూ తల్లిదండ్రులు, అత్తమామలతో కథానాయిక పడిన ఇబ్బందులు నవ్వు తెప్పించనున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ని బట్టి చిత్రం ఆహ్లాదకరంగా అశ్లీలతకు తావులేకుండా ఉంటుందని తెలుస్తోంది.
సినిమాల్లో కథానాయకులను తన అందంతో మాయ చేసే భామ రకుల్ ప్రీత్ సింగ్. తన తర్వాతి చిత్రం 'ఛత్రీవాలీ'లో ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేసే యువతిగా నటిస్తోంది. ఆ క్రమంలోనే ఒక ఉద్యోగం వస్తుంది. అదే కండోమ్ టెస్టర్. వాటి సామర్థ్యాన్ని అంచనా వేయడమే తన విధి. తను అక్కడ చేరాకా ఎదుర్కొన్న సమస్యలేంటి? ఇంట్లో, బంధువుల్లో తన ఉద్యోగం గురించి ఏమి చెప్పింది? లాంటి అంశాలను స్పృశిస్తూ దర్శకుడు తేజస్ ప్రభ విజయ్ దేవుస్కర్ తెరకెక్కిస్తున్నాడు. నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.
Upcoming Periodical movies 2022: పూర్వ కాలంలో శత్రుదేశాల రాజులతో మన వాళ్లు ఎలా పోరాడారన్నది ఎపుడూ ఆకట్టుకునే అంశమే. యుద్దక్షేత్రంలో కత్తులు, గుర్రాలు, ఏనుగుల హడావిడి, నినాదాలతో తెర కన్నులకు నిండుగా ఉంటుంది. దీనినే ఇతివృత్తంగా తీసుకుని ఈ ఏడాది రెండు చిత్రాలు రానున్నాయి. పీరియాడికల్ డ్రామాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాల విశేషాలివే.
Ranbirkapoor shamshera movies: రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'షంషేరా'. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కరణ్మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్నారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి స్వాతంత్య్రం కోసం పోరాడే ఒక బందిపోటు సమూహం కథే ఇది. వాణీకపూర్, సంజయ్‌దత్ ప్రధానపాత్రల్లో కనిపిస్తారు. జులై 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. స్వాతంత్య్రం అడిగితే వచ్చేది కాదు పోరాడి పొందాల్సిందే అంటూ ముఖ్య పాత్రలు నినదించడాన్ని ప్రచార చిత్రాల్లో ఇప్పటికే చూపించారు.
Akhsya kumar Prithviraj: అతిదుర్మార్గమైన శత్రువు మహమ్మద్ ఘోరీని, అతడి చీమల దండులాంటి సైన్యాన్ని 16 సార్లు తరిమికొట్టిన వాడు పృథ్వీరాజ్ చౌహాన్. ఆఖరికి 17వ సారి జరిగిన దండయాత్రలో ఓటమి పాలవుతాడు. యుద్ధం నేపథ్యంలో ఒక గొప్ప చిత్రాన్ని తీయడానికి పృథ్వీరాజ్ జీవితాన్ని మించిన కథ ఏముంటుంది.? అందుకే ఆ యుద్ధ వీరుడి సాహసాలను కళ్లకు కట్టేందుకు అక్షయ్ కుమార్ ‘పృథ్వీరాజ్’గా రానున్నాడు. కథానాయికగా మానుషి ఛిల్లర్ నటిస్తోంది. సోనూసూద్, సంజయ్ దత్, అశుతోష్ రాణా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. చంద్రప్రకాశ్ ద్వివేదీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూన్ 3న థియేటర్లలోకి రానుంది.
Upcoming Army movies 2022: దేశానికి సేవ చేస్తూ ప్రాణాలు కోల్పోవడం ఒక సైనికుడికే సాధ్యమయ్యే విషయం. ఇలా మన దేశ రక్షణ కోసం పోరాడుతూ ఆ ఘటనల్లోనే అమరులైన ఇద్దరు వీరుల జీవితాలు తెరకెక్కుతున్నాయి. వారెవరెంటే..?
Adivisesh Major movie: భారతీయులను ఎప్పటికీ వెంటాడే విషాదం 2008 ముంబయి పేలుళ్లు. ఆ ఉపద్రవంలో అమాయకులను కాపాడటానికి వచ్చిన వీరుల్లో ఒకరు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. ముష్కర మూకల నుంచి దేశాన్ని కాపాడే ప్రయత్నంలో మేజర్ సందీప్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆపరేషన్‌లో ఆయన చేసిన ధైర్యసాహసాలే ఇతివృత్తంగా ‘మేజర్’ తెరకెక్కుతోంది. అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా నటిస్తున్నారు. శశికిరణ్ తిక్కా దర్శకుడు. ఈ చిత్రం మే 27న విడుదల కానుంది.
మన దేశ సైనికుల శౌర్యానికి గుర్తుగా ఇచ్చే అత్యున్నత సైనిక పురస్కారం పరమ్ వీర్ చక్ర. ఈ పురస్కారాన్ని అందుకున్న అతి తక్కువ మందిలో ఒకరు సెకండ్ లెఫ్ట్‌నెంట్ కల్నల్ అరుణ్ ఖేతర్‌పాల్. 1971లో పాకిస్థాన్ - భారత్ మధ్య జరిగిన బసంతర్ యుద్ధంలో వీరమరణం పొందిన ఈ సైనికుడిపై వస్తున్న చిత్రం ‘ఇక్కీస్’. ఆ యుద్ధంలో అరుణ్ ప్రదర్శించిన తెగువను కథానాయకుడు వరుణ్ ధావన్ మరో సారి చూపించనున్నాడు. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబరు 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి: అలా చేస్తే నా కోరికలు తప్పకుండా నెరవేరేవి: సమంత