సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ 'విరూపాక్ష' థియేటర్లలో మొదటి వీకెండ్‌ను పూర్తిచేసుకుంది. శుక్రవారం (ఏప్రిల్ 21న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. యాక్సిడెంట్ తరువాత తేజూ నటించిన తొలి సినిమా కావడంతో విరూపాక్షపై మెగా అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించడం, ఈ సినిమా నిర్మాణంలో ఆయన భాగస్వామి కావడంతో అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలు అందుకోవడంతో విరూపాక్ష వంద శాతం సఫలమైంది. సుకుమార్ శిష్యుడు, కొత్త దర్శకుడు కార్తిక్ వర్మ దండు తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించారు.
తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.12 కోట్ల గ్రాస్ వసూలు చేసిన విరూపాక్ష.. రెండు రోజుల్లో రూ.28 కోట్ల గ్రాస్ రాబట్టిందని సమాచారం. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు శనివారం కలెక్షన్స్ పెరిగాయి. ఇక రెండో రోజుతో పోలిస్తే మూడో రోజు మరింత పెరిగి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.44 కోట్ల మేర గ్రాస్ వసూలైందని మేకర్స్ తెలిపారు.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం విరూపాక్ష షేర్ కలెక్షన్ విషయానికి వస్తే.. మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా వసూలైన షేర్ సుమారు రూ.22 కోట్లు. ఒక మీడియం రేంజ్ సినిమాకు మూడు రోజుల్లో రూ.20 కోట్ల షేర్ అంటే మంచి కలెక్షన్ అనే చెప్పాలి. విరూపాక్ష ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.22 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. రూ.23 కోట్ల మేర షేర్ వసూలైతే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. అంటే బ్రేక్ ఈవెన్‌కు తేజ్ సినిమా చాలా దగ్గరలోనే ఉంది. అన్ని సినిమాల మాదిరిగా విరూపాక్షకు అత్యధిక షేర్ తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చింది.
మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల గ్రాస్ రూ.27.75 కోట్లుగా ఉంది. దీనిలో డిస్ట్రిబ్యూటర్ షేర్ విలువ సుమారు రూ.16.5 కోట్లు. తొలిరోజు తెలుగు రాష్ట్రాల బాక్సాఫీసు షేర్ రూ.4.79 కోట్ల మేర ఉండగా.. రెండో రోజు రూ.5.8 కోట్లు, మూడో రోజు రూ.5.77 కోట్ల మేర ఉంది. అమెరికాలో సైతం విరూపాక్షకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఉత్తర అమెరికాలో దసరా సినిమా కంటే కూడా విరూపాక్షకు ప్రేక్షకుల తాకిడి ఎక్కువగా ఉండటం విశేషం. తొలి వారాంతం ముగిసే సరికి యూఎస్‌లో విరూపాక్ష 7 లక్షల 60 వేల డాలర్లు వసూలు చేసింది.