కొత్త సినిమాల నిర్మాణాన్ని ఆపే ఉద్దేశం తమకు లేదని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తెలిపింది. టాలీవుడ్‌లో నెలకొన్న వివిధ సమస్యలపై ఈ నెల 23న జరిగే సమావేశంలో ఫిల్మ్ ఛాంబర్‌తో కలిసి తుది నిర్ణయం తీసుకుంటామంది. ఓటీటీల ప్రభావం, నిర్మాణ వ్యయం, సినిమా టికెట్ ధరలు.. తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని కొందరు నిర్మాతలు ఆగస్టు 1 నుంచి షూటింగ్‌లు నిలిపివేయాలని భావించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి గురువారం సమావేశమైంది. సమావేశం అనంతరం, నిర్మాత సి.కల్యాణ్ మీడియాతో మాట్లాడారు.
'సినిమాల కంటెంట్, ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా టికెట్ ధరలు, ఓటీటీల గురించి చర్చించాం. యూనియన్‌లు, ఫెడరేషన్, మేనేజర్‌ల పాత్ర, నటులు, సాంకేతిక నిపుణుల సమస్యల గురించీ మాట్లాడం. షూటింగ్‌లు నిలిపివేయాలా? వద్దా? కొత్త ప్రాజెక్టులు కాకుండా ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న వాటినే నిలిపివేయాలా?.. ఇలా అనే కోణాల్లో చర్చించాం. 23న జరిగే మీటింగ్‌లో తుది నిర్ణయం తీసుకుంటాం' అని కల్యాణ్ వివరించారు. ఈ సమావేశంలో దిల్ రాజు, ప్రసన్న కుమార్, జెమిని కిరణ్, ఠాగూర్ మధు, నట్టి కుమార్, అభిషేక్ అగర్వాల్, తమ్మారెడ్డి భరద్వాజ, బెక్కం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఈ హీరోయిన్ల అసలు పేరు మీకు తెలుసా?