Miss Grand India 2022 Prachi nagpal : ఆ యువతి మధుమేహంతో బాధపడుతోంది. దీంతో రోజూ నాలుగైదు సార్లు ఇన్సులిన్ తీసుకోవాల్సిందే.. అయినా కుంగిపోకుండా తనకు ఇష్టమైన అందాల పోటీ రంగంలో రాణించేందుకు ఎంతో శ్రమించింది. మధుమేహంతో పోరాడుతూ.. ఇన్సులిన్ తీసుకుంటూనే అందాల పోటీలకు హాజరైంది. చివరికి ఆమె శ్రమ ఫలించి.. ‘మిస్ గ్రాండ్ ఇండియా- 2022’ పోటీల్లో విజేతగా నిలిచింది.
ఆ ఘనత సాధించిన యువతే.. హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన ప్రాచీ నాగ్‌పాల్. ఈ నెల 4న నిర్వహించిన పోటీల్లో ప్రాచీ నాగ్‌పాల్‌ను విజేతగా ప్రకటించారు. ఇండోనేషియా వెస్ట్‌జావా నగరంలోని సెంతుల్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో అక్టోబరు 25న నిర్వహించనున్న ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2022’లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.
మాదాపూర్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ కమ్యునికేషన్ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ చదివిన ఆమె ప్రస్తుతం లగ్జరీ, ఫ్యాషన్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ చేస్తున్నారు. నానక్‌రాంగూడలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. మిస్ గ్రాండ్ ఇండియా పోటీలో పాల్గొని విజేతగా నిలవడానికి 8 నెలలు కఠోరంగా శ్రమించానని అన్నారు. డయాబెటిస్ వల్ల రోజుకు నాలుగైదు సార్లు ఇన్సులిన్ తీసుకుంటూ ఆహార నియమాలు పాటించానని వివరించారు.