Maheshbabu Sarkaru vari paata: 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో.. వాడే పండుగాడు..' ప్రిన్స్ మహేష్‌బాబు. క్లాస్ అయినా, మాస్ అయినా.. ఆ పాత్రలపై తనదైన ముద్ర ఉండితీరాల్సిందే. బాక్సాఫీసు దగ్గర హడావిడి చేయాల్సిందే. ఇటీవల పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' చేశారు. ఆ చిత్రం ఈ గురువారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను ముచ్చటించారాయన. ఆ విషయాలు...
ఈ సినిమా చేస్తున్నప్పుడు 'పోకిరి' రోజులు గుర్తుకొచ్చాయని చెప్పారు మీరు. మీ చిత్రబృందం కూడా అదే మాట అంటోంది. కారణమేంటి?
'పోకిరి' అనేది మాస్ యుఫోరియాతో కూడిన సినిమా. అదే తరహా మాస్ అంశాలతో ఈ సినిమా ఉంటుందీ. అలాంటి షేడ్స్ ఉన్న పాత్ర దొరకడంతోనే 'పోకిరి' రోజులు గుర్తుకొచ్చాయని చెప్పా. దీని క్రెడిట్ అంతా దర్శకుడికే చెందుతుంది. నా హావభావాలు, సంభాషణలు చెప్పిన విధానం చాలా బాగుంటుంది. పాత్రని చాలా కొత్తగా డిజైన్ చేశారు. ప్రతీ నిమిషం ఆస్వాదిస్తూ చేశా.
నటుడిగా ఇలాంటి పాత్రలు చేయడంలో ఉన్న సౌలభ్యం ఏమిటి?
ఒక కథకి ఏం కావాలో అదే చేస్తాను. దాన్నుంచి బయటికి రాను. ఏ కథయినా సరే, దానికి తగ్గట్టే నటన ఉండాలనుకుంటా. 'సర్కారు వారి పాట' కథ, ఇందులోని పాత్రలు వేరు. హద్దులు లేకుండా మరింత ఫ్రీగా ఇలాంటి పాత్రలు చేయొచ్చు. నాలుగేళ్లుగా నా ప్రయాణం అద్భుతంగా సాగుతోంది. ఈ సినిమా మరింత కొత్తగా ఉంటుంది. అభిమానులతోపాటు అందరికీ నచ్చేలా ఉండాలి సినిమాలు. బడ్జెట్‌లు పెరిగాయి. ఇప్పుడు ప్రయోగాలు కూడా చేయలేం. ఇలాంటి సినిమాలు తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తాయి.
ఈ సినిమా ప్రయాణం ఎలా సాగింది? కరోనా సమయంలో కథలో మార్పులు, చేర్పులేమైనా చేశారా?
కథ పరంగా కాకుండా 'మ మ మహేషా..' పాట విషయంలోనే కొంచెం మార్పు చేశాం. మొదట వేరే పాట అనుకున్నాం. సినిమా చూసుకున్నాక ఓ మాస్ పాట ఉంటే బాగుండేదనే అభిప్రాయం కలిగింది. దాంతో మొదటిదాన్ని పక్కన పెట్టి పది రోజుల వ్యవధిలో మ మ మహేషా పూర్తి చేశాం. ఇక సినిమా ప్రయాణం అంటారా? కరోనా వల్ల చాలా క్లిష్టంగానూ, అదే సమయంలో కొత్తగానూ అనిపించింది. ఏ సినిమా అయినా కూడా ఏడెనిమిది నెలల్లో పూర్తి చేసేస్తాం. కానీ, దీనికి రెండేళ్లు ప్రయాణం చేశాం. మానసికంగా శారీరకంగా చాలా కష్టంగా అనిపించింది. ఈ విషయంలో నిర్మాతలకి కృతజ్ఞతలు చెప్పాలి. 'దూకుడు', 'శ్రీమంతుడు'ల నుంచి వాళ్లతో కలిసి ప్రయాణం చేస్తున్నా.
గత సినిమాలతో ఓ బలమైన అంశాన్ని చెప్పారు. మరి ఈ సినిమాతో?
ఇందులో కొత్తగా ప్రయత్నించాం. దాన్ని తెరపై చూసి ఆస్వాదించాలంతే. దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు నన్ను ఆత్రుతకి గురిచేసిన విషయం అదే. పరశురామ్ రచనలో దిట్ట. దర్శకుడు రచయిత కూడా అయితే ఆ ప్రభావం వేరుగా ఉంటుంది. ఈ సినిమాని ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూస్తారు. నాకూ, కీర్తికీ మధ్య సాగే లవ్ ట్రాక్ చాలా బాగుంటుంది. తమన్ సంగీతం బాగా కుదిరింది. తను ఇప్పుడొక సంగీత సంచలనం. ప్రేక్షకులకి ఏ పాట నచ్చుతుందో తనలో చాలా స్పష్టత వుంది. కళావతి పాట ఇచ్చినప్పుడు మాకు మొదట అంత తొందరగా నచ్చలేదు. 'నన్ను నమ్మండి, మహేష్ కెరీర్‌లోనే ఒకానొక అత్యుత్తమమైన పాట అవుతుంద'ని చెప్పారు. అదే జరిగింది. నాకు ఇష్టమైన పాట కూడా అదే. సముద్రఖని నటన కూడా ఆశ్చర్యపరుస్తుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ట్రైలర్ చూస్తే కొన్ని ఘాటైన సంభాషణలు సినిమాలో ఉన్నాయనిపిస్తుంది. అవి చెబుతున్నప్పుడు సెట్లో మీకేం అనిపించింది?
ఆ పాత్ర నడవడిక అలా ఉంటుంది. నేను స్క్రిప్ట్‌కి లొంగిపోయి నటిస్తా. పాత్ర డిమాండ్ చేసినప్పుడు అలాంటి సంభాషణలు చెప్పడానికి ఏమాత్రం వెనకాడను.
పొరుగు భాషల్లో సినిమాలు చేయాలి, అక్కడి మార్కెట్‌ని కూడా సొంతం చేసుకోవాలనే ఆలోచనలేమైనా చేస్తుంటారా?
మొదట్నుంచీ తెలుగు సినిమాలే చేస్తానని చెబుతున్నా. మన పరిశ్రమ వదిలి వేరే చోటుకి ఎందుకు వెళ్లడం అనేది నా భావన. మనం ఇక్కడ చేసిన తెలుగు సినిమాలే అన్ని భాషల్లోకి వెళ్లాలని చెబుతూ వచ్చా. పదేళ్లుగా నేను అనుకున్నదే ఇప్పుడు నెరవేరుతోంది కదా.. మరి నాకంటే ఆనందం ఇంకెవరికి ఉంటుంది? మన తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఆడుతుంటే, నా కల నెరవేరిన భావన కలుగుతోంది.
త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా ఎలా ఉంటుంది?
దాని గురించి ఇప్పుడే మాట్లాడితే తొందరపడినట్టే ఉంటుంది. మా కలయిక అనగానే ఓ ప్రత్యేకమైన ఆత్రుత కనిపిస్తుంది ప్రేక్షకుల్లో. ఆయన రాసే సంభాషణలు అద్భుతం. వాటిని వింటున్నప్పుడు, సెట్లో నటిస్తున్నప్పుడు అది నటనలా ఉండదు. మేం ఇద్దరం ఎప్పుడు స్క్రిప్ట్ గురించి మాట్లాడుకున్నా, ఫోన్‌లో ఫలానా సన్నివేశం ఇలా వచ్చిందని చెప్పినా మనసులో వేరే రకమైన తృప్తి కలుగుతుంది. ఎప్పుడెప్పుడు ఆ సినిమా సెట్స్‌కి వెళదామా అని ఎదురు చూస్తున్నా. చాలా కొత్తగా ఉంటుంది ఆ సినిమా.
తదుపరి రాజమౌళితో సినిమా చేస్తున్నారు కదా..?
నేను, రాజమౌళి కలిసి సినిమా చేస్తున్నప్పుడు చాలానే ఊహిస్తారు కదా? అందుకు తగ్గట్టే ఉంటుంది ఆ సినిమా. ఆయనతో ఒక సినిమా చేస్తే పాతిక సినిమాలు చేసినంత అనుభవం. ఆలస్యమైనా సరే, అందుకు తగ్గట్టే ఉంటుంది.
మీ నాన్న, నటులు కృష్ణ బయోపిక్ కోసం ఎవరైనా సంప్రదించారా?
నన్నెవ్వరూ సంప్రదించలేదు. ఒకవేళ వచ్చినా నేను చేయలేను. ఈ ఆలోచన గురించి వింటుంటేనే నా కాళ్లు వణుకుతున్నాయి. నాన్న నాకు దేవుడితో సమానం. నేను ఆయనలా నటిస్తానని అనుకోను.
కరోనా తర్వాత ట్రెండ్‌లో పెద్ద మార్పు వచ్చిందని నేననుకోను. ఎప్పటికైనా వాణిజ్య సినిమా వాణిజ్య సినిమానే. ప్రేక్షకుడు థియేటర్లోకి అడుగు పెడితే ఆ సందడి వేరు. అలా కాకుండా కొత్త ట్రెండ్ వచ్చిందని మనం ఏదేదో ప్రయత్నిస్తే అది సరైనది కాదని నా అభిప్రాయం. కాకపోతే మన సినిమా స్థాయి పెద్దదైంది. మన ప్రేక్షకులు పెరిగారు. నిర్మాణ వ్యయం పెరిగింది.
ఈ రెండేళ్ల కాలంలో పిల్లలతో కలిసి మరింత సమయం గడిపాను. వాళ్లు ఎంత వేగంగా ఎదిగారో అర్థమైంది. ఈతరంలో చాలా స్పష్టత వుంది. అందుకే గౌతమ్, సితార వాళ్ల నిర్ణయాలు వాళ్లే తీసుకుంటారు. సితారకి నటన అంటే ఇష్టం. అది నాకు గర్వంగా అనిపించింది. యూట్యూబ్, నటన అంటూ సితార ఒక రకమైన పనులు చేస్తే, గౌతమ్ మరో రకమైన ప్రపంచంలో ఉంటాడు. వాళ్ల కలల్ని సాకారం చేయడమే తల్లిదండ్రులుగా మా ముందున్న లక్ష్యం.
ఇదీ చూడండి: శంకర్ డైరెక్షన్లో తారక్!.. పుట్టినరోజున రెండు సినిమాల నుంచి సర్ప్రైజ్లు!