Keethi suresh Chinni movie review: చిత్రం: చిన్ని; నటీనటులు: కీర్తి సురేశ్, సెల్వరాఘవన్ తదితరులు; సంగీతం: సామ్ సీఎస్; ఎడిటింగ్: నాగూరన్ రామచంద్రన్; సినిమాటోగ్రఫీ: యామిని యజ్ఞమూర్తి; నిర్మాత: డి.ప్రభాకరన్, సిద్ధార్థ్ రావిపాటి; రచన, దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్; విడుదల: అమెజాన్ ప్రైమ్ వీడియో
'మహానటి'తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తిసురేశ్ తెలుగు, తమిళ భాషల్లో విభిన్న చిత్రాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటోంది. ఓవైపు కమర్షియల్ చిత్రాల్లో కథానాయికగా నటిస్తూనే మరోవైపు మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో అలరిస్తోంది. అలా శ్రీరాఘవతో కలిసి కీర్తి ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం 'సాని కాయిదం' ఈ సినిమా తెలుగులో 'చిన్ని' పేరుతో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. పోస్టర్లు, ప్రచార చిత్రాల్లో కీర్తి సురేశ్ పూర్తి డీగ్లామర్‌గా కనిపించారు. మరి 'చిన్ని' కథేంటి? కీర్తిసురేశ్ ఎలా నటించింది?
కథేంటంటే: చిన్ని(కీర్తి సురేశ్) పోలీస్ కానిస్టేబుల్. భర్త మారెప్ప, కూతురు ధననే తన లోకం. మారెప్ప ఊళ్లో ఉన్న రైస్ మిల్లులో పనిచేస్తుంటాడు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఆ మిల్లు ఓనర్, అతడి స్నేహితులతో గొడవకు దిగుతాడు. వారిపై చేయి చేసుకుంటాడు. దీన్ని అవమానంగా భావించిన మిల్లు ఓనర్ అతడి స్నేహితులు మారెప్ప కుటుంబాన్ని నాశనం చేయాలని అనుకుంటారు. మిల్లులో జరిగిన గొడవ ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? చిన్ని జీవితం ఎలా ఛిన్నాభిన్నమైంది? అప్పుడు చిన్ని తీసుకున్న నిర్ణయం ఏంటి? మధ్యలో రంగయ్య(శ్రీరాఘవ) ఎవరు? అతడికి, చిన్నికీ ఉన్న సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే: ఇదొక రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్. కథ అంతా 1989 నాటి నేపథ్యంలో సాగుతుంది. అప్పటి సమాజంలో ఉన్న పేద, అగ్రవర్ణాల మధ్య ఆధిపత్య పోరులో సమిధలైన కుటుంబాల ఇతివృత్తంగా కథను రాసుకున్నాడు దర్శకుడు. అయితే, ఆ కథను నేరుగా చెప్పేస్తే చాలా చప్పగా ఉంటుంది. అలాంటి భావన ప్రేక్షకుడిలో కలగనీయకుండా కథ, తర్వాతి వచ్చే సన్నివేశాల్లో ఉండే గాఢత ఆధారంగా కాండాలుగా విభజించుకున్నాడు. ప్రతి కాండం, దాని నేపథ్యం బ్లాక్ అండ్ వైట్ థీమ్‌తో మొదలు పెట్టి, దానికి కనెక్ట్ అయ్యేలా గతంలో ఏం జరిగిందన్న విషయాన్ని కలర్‌లో చూపించటం కొత్తగా ఉంది. చిన్ని, రంగయ్యలు కలిసి ఓ మహిళను హత్య చేయటంతో కథను మొదలు పెట్టిన దర్శకుడు, కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చిన్ని ఆశలు, ఆశయాలు.. మిల్లు ఓనర్‌తో భర్త మారెప్ప గొడవ.. రంగయ్యతో చిన్ని కూతురు స్నేహం ఇలా కథ, అందులోని పాత్రలను పరిచయం చేస్తూ కథా నేపథ్యాన్ని పరిచయం చేశాడు. ఎప్పుడైతే మిల్లు యజమానితో మారెప్ప గొడవ పడతాడో అసలు కథ అప్పుడే మొదలవుతుంది. ఆ తర్వాత చిన్ని, ఆమె కుటుంబంపై వాళ్లు ఒడిగట్టే దారుణాలు సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తాయి.
ఇలాంటి సన్నివేశాలను ‘కట్ చేస్తే’లా సింపుల్‌గా చూపించవచ్చు. కానీ, చిన్నికి ఘోర అన్యాయం జరిగిందన్న భావన ప్రేక్షకుడిలో కలిగినప్పుడే కథలో మరింత లీనం చేసే అవకాశం లభిస్తుంది. ఆ ఇంటెన్సిటినీ పుష్కలంగా వాడుకున్నాడు దర్శకుడు. న్యాయస్థానం నుంచి నిందితులు తప్పించుకుపోవటంతో, అప్పుడు చిన్ని తీసుకునే నిర్ణయంతో కథ పూర్తి రివేంజ్ డ్రామాగా టర్న్ తీసుకుంటుంది. ఆ క్రమంలో చిన్ని పలికే సంభాషణలు నాటి సమాజంలో ఉన్న పరిస్థితులకు అద్దం పట్టాయి. ఇక అక్కడి నుంచి చివరి వరకూ రంగయ్యతో చిన్ని ఒక్కొక్కరినీ వేటాడే ప్రతి సన్నివేశాన్ని ఆసక్తికరంగా, ఉత్కంఠగా తీర్చిదిద్దాడు దర్శకుడు. కానీ, సినిమా పూర్తిగా లాజిక్‌గా దూరంగా సాగుతుంది. చిన్ని, రంగయ్య హత్యలు చేస్తున్నా, పోలీసులు ఇటు నిందితుల కోసం కానీ, అటు హత్యలు చేస్తున్న వాళ్ల కోసం వెతికినట్లు ఎక్కడా చూపించలేదు. ఇక ప్రతి విషయాన్ని, పాత్రను డీటెలియింగ్ చూపించే క్రమంలో చాలా సన్నివేశాలు సాగదీసినట్టుగా అనిపిస్తాయి. ఇలాంటి కథలో పాటలు జొప్పించకుండా సినిమా తీయడం ప్రేక్షకుడికి కాస్త ఉపశమనం. ఈ వీకెండ్‌లో క్రైమ్‌థ్రిల్లర్ చూడాలనుకునే వారిని ‘చిన్ని’ కచ్చితంగా ఒక మంచి ఆప్షన్. కాకపోతే కుటుంబంతో కలిసి చూడాలంటే కాస్త హింస ఎక్కువగా అనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే: ఈ కథకు చిన్ని, రంగయ్య పాత్రలు రెండు కళ్లు. వాళ్ల దృష్టి కోణం నుంచే మనం ఈ సినిమాను చూస్తాం. ‘మహానటి’ తర్వాత ఒకట్రెండు కథానాయిక నేపథ్యం ఉన్న సినిమాలు చేసినా కీర్తి సురేశ్‌కు తగిన గుర్తింపు రాలేదు. ఆ లోటును 'చిన్ని' భర్తీ చేసింది. భర్త, కూతురు ఇలా తన కుటుంబం, ఉన్నతంగా బతకాలన్న ఆశయం కలిగిన మహిళగా చిన్ని పాత్రలో కీర్తి సురేశ్ ఒదిగిపోయింది. అదే సమయంలో తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకునే చిన్నిగానూ రౌద్రాన్ని అద్భుతంగా పలికించింది. తనని చంపడానికి వస్తున్న వారిపై వ్యాన్‌ను నడిపించుకుంటూ వెళ్లే సీన్‌లో కీర్తి సురేశ్ నటన హైలైట్. రంగయ్య పాత్రలో శ్రీరాఘవ (సెల్వ రాఘవన్) కూడా చక్కగా నటించారు. పతాక సన్నివేశాల్లో శ్రీరాఘవ పాత్ర ప్రేక్షకుడితో కంటతడి పెట్టిస్తుంది. మిగిలిన వాళ్లు పెద్దగా తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వారు కాదు. అయినా, వారి పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికంగా... సినిమా చాలా బాగా ఉంది. సామ్ సీఎస్ సంగీతం సినిమాకు ప్రధాన బలం. నేపథ్య సంగీతం ప్రతి సన్నివేశం ప్రేక్షకుడిని కథలో లీనం చేస్తుంది. యామిని యజ్ఞమూర్తి సినిమాటోగ్రఫీ చాలా చక్కగా ఉంది. కథ, సన్నివేశంలో ఉన్న డెప్త్‌ను బట్టి వాడిని థీమ్స్, కలర్‌టోన్స్ చాలా బాగున్నాయి. నాగూరన్ ఎడిటింగ్‌కు ఇంకాస్త పనిచెప్పాల్సింది. వాస్తవికత కోసం కొన్ని సన్నివేశాలు ట్రిమ్ చేయకుండా వదిలేశారు. అరుణ్ మాథేశ్వరన్ ఎంచుకున్న కథేమీ కొత్తది కాదు. కానీ, దాన్ని తీర్చిదిద్దిన విధానం కాస్త భిన్నంగా ఉంది. స్క్రీన్‌ప్లేను ఇంకాస్త వేగంగా నడిపించి ఉంటే బాగుండేది. బహుశా ఓటీటీ కావడంతో రక్తపాతం ఉన్న సన్నివేశాలను యథాతథంగా వదిలేశారు.
బలాలు
+ కీర్తి సురేశ్, శ్రీరాఘవల నటన
+ నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ
+ మూవీ మేకింగ్
బలహీనతలు
- కథలో కొత్తదనం లేకపోవటం
- సన్నివేశాల నిడివి
చివరిగా: 'చిన్ని' వైలెన్స్ కాస్త పెద్దగానే ఉంటుంది.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
ఇదీ చూడండి: మహేశ్-కీర్తి మాస్ డ్యాన్స్.. లవ్మూడ్లో నాని-నజ్రియా