చిత్ర పరిశ్రమలో నటులు దర్శకులుగా మారడం ఎప్పటినుంచో చూస్తూనే ఉన్నాం. అయితే వీరిలో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా చాలామంది హీరోలు.. దర్శకులుగా మారి సత్తా నిరూపించుకున్నప్పటికీ.. కమెడియన్లు డైరెక్టర్స్‌గా మారి హిట్‌ను అందుకున్న సందర్భాలు తక్కువనే చెప్పాలి. ఆ మధ్యలో హాస్యనటుడు వెన్నెల కిషోర్ మెగా ఫోన్ పట్టినా ఆకట్టుకోలేకపోయారు. అయితే మరో నటుడు అవసరాల శ్రీనివాస్ మాత్రం దర్శకుడిగా మంచి విజయాలనే అందుకున్నారు. అయితే ఇప్పుడు మరో కమెడియన్ కూడా మెగా ఫోన్ పట్టారు. ఆయనే జబర్దస్త్ వేణు. ఆయనే దర్శకుడిగా మారి 'బలగం' అనే సినిమాను తెరకెక్కించారు. ఏకంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్లో తన తొలి సినిమాను రూపొందించారు. మార్చి 3న చిత్రం సినిమా విడుదలైంది.
ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన బలగం దిల్‌రాజుకు రెండింతల లాభాల్ని తెచ్చిపెట్టింది. మొదటి వారంలో ఈ సినిమా సుమారు రూ. ఏడు కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. తొలిరోజు వసూళ్లు పెద్దగా రాకపోయినప్పటికీ మౌత్ టాక్ బాగుండటంతో రోజురోజుకూ కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి.
రిలీజ్ రోజు రూ.50 లక్షల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా గురువారం రూ.60 లక్షలకుపైగా కలెక్షన్స్ రాబట్టడం గమనార్హం. ఓవరాల్‌గా కోటిన్నర రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్‌తో రిలీజైన బలగం సినిమా.. ఫస్ట్ వీక్‌లో రూ. ఏడు కోట్ల గ్రాస్‌ను, రూ.మూడు కోట్లకుపైగా షేర్‌ను రాబట్టినట్లు సమాచారం. తెలంగాణ నేపథ్య కథాంశంతో రూపొందిన సినిమా కావడంతో నైజాం ఏరియాలోనే బలగం సినిమాకు రూ. నాలుగున్నర కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.
బలగం సినిమాతో హాస్యనటుడు వేణు దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ కీలక పాత్రల్లో నటించారు. కొమురయ్య అనే వృద్ధుడి మరణం చుట్టూ అల్లుకున్న కథతో మానవ సంబంధాలకు పెద్దపీట వేస్తూ దర్శకుడు వేణు ఈ సినిమాను తెరకెక్కించారు. దిల్‌రాజు సమర్పణలో ఆయన కుమార్తె హన్షిత, హర్షిత్‌రెడ్డి బలగం సినిమాను నిర్మించారు. తెలంగాణ జీవన సంస్కృతిని వాస్తవిక కోణంలో ఆవిష్కరించిన తీరుకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ వారం బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలేవి బరిలో లేకపోవడం బలగం సినిమాకు కలిసివచ్చే అవకాశం ఉన్నట్లు సినీ పండితులు చెబుతున్నారు.
అయితే ఈ సినిమా.. ఇటీవలే ఓ వివాదంలో చిక్కుకుంది. బలగం సినిమా కథ తనదేనంటూ ఓ వ్యక్తి వివాదం సృష్టించారు. అయితే ఆయన అలా అనడం హాస్యస్పదంగా ఉందని ఆ చిత్ర దర్శకుడు వేణు ఇటీవలే అన్నారు. బలగం సినిమా కథ.. కథ కాదని తెలుగు ప్రజల సంప్రదాయమని పేర్కొన్నారు. ఆ సంప్రదాయంపై ఏ ఒక్కరికి హక్కు లేదన్నారు. ఆరేళ్లుగా ఎంతో శ్రమించి బలగం కథ తయారు చేసుకున్నానని స్పష్టం చేశారు వేణు. సినిమా థియేటర్లో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న క్రమంలో తనను, తన నిర్మాతలను అబాసుపాలు చేసేలా ఆ వ్యక్తి వివాదం సృష్టించడం అర్థరహితంగా ఉందన్నారు. ఈ విషయంలో తాను కూడా కోర్టును ఆశ్రయించనున్నట్లు వేణు వెల్లడించారు.