Interesting Facts About Senior Actor Chandra Mohan Assets: హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు చంద్రమోహన్. ఆయన సినీ జీవితంలో చేయని పాత్ర లేదంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు హీరో.. తర్వాత కామెడీ హీరో.. అనంతరం "టాలీవుడ్ ఫాదర్", బ్రదర్, అంకుల్.. ఇలా క్యారెక్టర్లన్నీ ఆయనవే! ఇలా.. నిర్విరామంగా దాదాపు 40 సంవత్సరాల పాటు సినీ పరిశ్రమలో తన ప్రస్థానం కొనసాగించారు. ఈ నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టారు. కానీ.. దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తులను పోగొట్టుకున్నట్టు ఇటీవల స్వయంగా వెల్లడించారు చంద్రమోహన్.
1966లో విడుదలైన ‘రంగుల రాట్నం’ సినిమాతో చంద్రమోహన్ కెరీర్ స్టార్ట్ చేశారు. మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత దాదాపు 800 వరకు సినిమాల్లో నటించారు. వీటిల్లో ఎన్నో.. అద్భుతమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. ఎమోషనల్ పాత్రలో నేచురల్‌గా నటించి అభిమానుల చేత కంటతడి పెట్టించారు. అయితే.. వయసు మీద పడడం.. ఆరోగ్య సమస్యలు వంటి కారణాలతో గత నాలుగైదేళ్లుగా ఆయన వెండితెరపై కనిపించడం మానేశారు. గత సంవత్సరం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్రమోహన్.. తన కెరియర్ ఆరంభం నుంచి ఎదిగిన విధానం వరకు.. సంపాదించిన ఆస్తుల నుంచి.. పోగొట్టుకున్న సంపద వరకూ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత
శోభన్‌బాబు చెప్పినా వినకుండా: సినీ విశేషాలతోపాటు ఆర్థిక విషయాల గురించి వివరిస్తూ.. కాస్త భావోద్వేగానికి గురయ్యారు చంద్రమోహన్. తాను ఇండస్ట్రీకి అనుకోకుండా వచ్చానే కానీ.. నటుడు కావాలని రాలేదని చెప్పారు. ఆస్తులు కూడబెట్టిన నటుడిగా.. తన పేరు ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుందని.. కానీ, అందులో వాస్తవం లేదని అన్నారు. ఆ సమయంలోనే తాను పోగొట్టుకున్న ఆస్తుల గురించి వివరించారు.
సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీరావు హైదరబాద్ శివారులోని కొంపల్లిలో దగ్గర ద్రాక్షతోట కొన్నప్పుడు.. ఆయననూ కూడా కొనుగోలు చేయాలని చెప్పారట. దీంతో.. చంద్రమోహన్ ఏకంగా.. 35 ఎకరాల వరకు కొనుగోలు చేశారట. కానీ.. అప్పట్లో నటుడిగా ఎంతో బిజీగా ఉండేవారు చంద్రమోహన్. దీంతో.. ఆయన కొనుగోలు చేసిన తోటను చూసుకోవడానికి ఎవరూ లేకుండా పోయారు. దీంతో.. అనివార్యంగా అమ్మేయాల్సి వచ్చిందని చెప్పారు. శంషాబాద్ దగ్గర మెయిన్ రోడ్‌కు దగ్గరలో కూడా 6 ఎకరాలు కొనుగోలు చేశారు. కానీ.. తర్వాత ఆ భూమిని కూడా అమ్మేసినట్టు చెప్పారు.
అంతేకాదు.. మద్రాసులో చంద్రమోహన్‌కు 15 ఎకరాలు భూమి ఉండగా.. దాన్ని కూడా అమ్మేందుకు సిద్ధమయ్యారట. ఈ విషయం తెలుసుకున్న హీరో శోభన్ బాబు.. భూమిని విక్రయించొద్దని చెప్పారట. కానీ.. ఆయన మాట వినిపించుకోకుండా ఆ ల్యాండ్ కూడా అమ్మేశారు చంద్రమోహన్. ప్రస్తుతం ఆ భూమి విలువ సుమారు రూ.40 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇలా.. హైదరాబాద్, మద్రాస్‌లో తాను పోగొట్టుకున్న ఆస్తుల విలువ రూ.100 కోట్లు దాకా ఉంటుందని చెప్పారు. తాను సంపాదించిన వాటికన్నా.. పోగొట్టుకున్నవే ఎక్కువని చంద్రమోహన్ చెప్పారు. అయినప్పటికీ.. రిటైర్మెంట్ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నానని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.
కూతుళ్లకే : చంద్రమోహన్ కుటుంబం విషయానికి వస్తే.. ఆయనకు ఓ భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చంద్ర మోహన్ భార్య పేరు జలంధర. ఈమె రచయిత్రి. వీరికి మధుర మీనాక్షి, మాధవి అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొడుకులు లేరు. మధుర మీనాక్షి సైకాలజిస్ట్‌గా అమెరికాలో స్థిరడ్డారు. రెండో కుమార్తె మాధవి చెన్నైలో వైద్య వృత్తిలో సేవలందిస్తున్నారు. చంద్రమోహన్ సంపాదించిన ఆస్తి మొత్తం కూతుళ్ల పేరు మీద రాసినట్లు సమాచారం. ఈయన దివంగత దర్శకుడు కె.విశ్వనాథ్‌కి దగ్గరి బంధువు.