ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. తమ అభిమాన హీరల పాత చిత్రాలను మరోసారి వెండితెరపై చూసి ఫ్యాన్స్ తెగ సంబరిపడిపోతున్నారు. అయితే నాటి హిట్ చిత్రాలు సృష్టించిన ప్రభంజనం గురించి విని, ఆ అనుభూతి పొందాలనే నేటి యువత ఆసక్తే 'రీ రిలీజ్'కు కారణంగా నిలుస్తోంది. ఇదొక టైమ్ ట్రావెల్ లాంటిదని సినీ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
ఇటీవలే రీరిలీజ్ అయిన టాలీవుడ్ సినిమాలు 'చెన్నకేశవ రెడ్డి', 'వర్షం', 'బాద్షా', 'పోకిరి', 'ఖుషీ' అద్భుతమైన వసూళ్లను అందుకున్నాయి. అయితే నందమూరి నటసింహం బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'సింహా' చిత్రం మళ్లీ ధియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా తెలియజేసింది. మార్చి 11న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు తమ అభిప్రాయాలను నెట్టింట వ్యక్తం చేస్తున్నారు.
బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'సింహా' చిత్రం.. 2010 ఏప్రిల్ 30న విడుదలైంది. 'సింహా'.. ఓ అభిమానిగా బాలయ్యను తాను ఎలా చూపించాలనుకుంటున్నాడో, నందమూరి అభిమానులు బాలయ్య బాబును ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించి.. లయన్ ఈజ్ బ్యాక్ అనిపించారు బోయపాటి. బాక్సాఫీస్ బరిలో బాలయ్య 'సింహా'గా జూలు విదిలిస్తే ఎలా ఉంటుందో చూపించారు. బాలకృష్ణ- వీవీవినాయక్ కాంబోలో అప్పట్లో విడుదలై ఘన విజయం సాధించిన 'చెన్నకేశవరెడ్డి'.. గతేడాది సెప్టెంబరు 25 నాటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సెప్టెంబరు 25న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ భారీ స్థాయిలో రీరిలీజ్ చేశారు.
కాగా, ఈ ఏడాది సంక్రాంతికి బాలయ్య.. 'వీరసింహారెడ్డి' చిత్రంతో ప్రేక్షకుల మందుకు వచ్చారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే బాలయ్య.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేయనున్నారు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో సాగే ఈ సినిమాలో బాలయ్యకు కూతురుగా యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకోగా.. తదుపరి షెడ్యుల్ ఫిబ్రవరి 23నుంచి మొదలవ్వనుంది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం సినిమాను 2023 దసరాకు రిలీజే చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది.