తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంగా అభిమానించే కథానాయికల్లో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటుంది. అందుకే అభిమానులు ఆమెకు 'లేడీ పవర్‌స్టార్' అనే బిరుదును కట్టబెట్టేశారు. నటనకు ఆస్కారమున్న, వినూత్న పాత్రలను ఎంచుకుంటున్న ఈ నటనామయూరి అదే వరుసలో ‘'గార్గి' చిత్రంలో స్త్రీ ప్రాధాన్యమున్న పాత్రలో నటించింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ విశేషంగా అలరిస్తుండగా, ఇంకా ఈ సినిమా విశేషాలను పంచుకోవటానికి ఆమె కూడా మన ముందుకు వచ్చారు. ఆమె మాటల్లో 'గార్గి' ఎవరంటే..
- ఈ సినిమా చేయటానికి ప్రత్యేక కారణమేంటి?
సాయిపల్లవి: ఈ కథను వినగానే ఎలాగైనా ఈ పాత్రను చేయాలనిపించింది. అందరి జీవితాలను టచ్ చేసే కథ ఇది. ‘వకీల్ సాబ్’, ‘జై భీమ్’లా సమాజానికి ఏదైనా చెప్పే ఆస్కారమున్న పాత్రను ఇందులో చేశా.
- అంటే కథ మొత్తం లాపాయింట్ చుట్టూ తిరుగుతూ ఉంటుందా?
సాయిపల్లవి: అన్ని ఎమోషన్స్ ఉంటాయి. నాతో సమాంతరంగా ఒక లాయర్ పాత్ర సాగుతుంది. న్యాయం కోసం పోరాడే నా పాత్ర ప్రేక్షకులను అలరిస్తుంది.
- అసలు 'గార్గి' టైటిల్ వెనుక అంతరార్థమేమిటి?
సాయిపల్లవి: 'గార్గి' మన పురాణాలలో స్త్రీపాధాన్యమున్న పాత్ర పేరు. ఆ పేరుకి న్యాయం చేసేలానే ఈ సినిమాలో గార్గి పాత్ర ఉంటుంది.
- ఈ సినిమాలో ఒక స్కూల్ టీచర్ పాత్ర చేశారు కదా?ఎలా అనిపించింది?
సాయిపల్లవి: నేను స్కూల్ లైఫ్‌ని చాలా తక్కువగా ఎంజాయ్ చేశాను. డ్యాన్స్ నేర్చుకోవడానికి అటెండెన్స్ ఇచ్చి వెళ్లిపోయేదాన్ని. అటువంటిది ఈ సినిమాలో టీచర్‌గా నటించాకా వారెంత కష్టపడతారో తెలిసింది.
- ముందు ఈ కథ ఐశ్వర్య లక్ష్మీ దగ్గరికి వెళ్తే, ఆమె మీ పేరు ప్రతిపాదించారట?
సాయిపల్లవి: అవును. నిజానికి ఆమె, డైరెక్టర్ గౌతమ్ చంద్రన్ స్నేహితులు. ఆమె ఈ రోల్‌కి సాయిపల్లవి న్యాయం చేస్తుందని చెప్పారట. ఆమె కూడా ఈ సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నారు. నిజంగా ఇది గొప్ప విషయం. కొన్ని పాత్రలకు న్యాయం చేసే పేర్లను నేనిలాగే ప్రతిపాదించాను.
- ఈ సినిమా ట్రైలర్‌లో స్త్రీ స్వేచ్ఛ గురించి కొన్ని డైలాగ్స్ ఉన్నాయి..దీనికి మీ సమాధానం
సాయిపల్లవి: అవును..నిజ జీవితంలో తల్లిదండ్రులతో అమ్మాయిల సంభాషణలు ఎలా ఉంటాయో ఈ డైలాగ్స్ అలానే ఉంటాయి. నిజజీవితంలో పాత్రలానే గర్గి పాత్ర ఉంటుంది.
- ఇటీవల అన్యాయంగా కేసుల్లో ఇరికించిన కథలనే ఎక్కువగా సినిమాలు తీస్తున్నారు. వాటికన్నా ఈ సినిమాలో ఏంటి ప్రత్యేకం?
సాయిపల్లవి: అసలు ఈ సినిమాలో ఏ వ్యవస్థను మేము ఎవరిని పాయింట్ చేయలేదు. ఒక అమ్మాయికి తనకు వచ్చిన ఆపదను, తనకున్న బంధనాలను దాటి ఎలా ఎదుర్కొందనే ఈ చిత్ర కథ
- విరాటపర్వానికి చాలా కష్టపడ్డారు కదా?ఫలితం నిరాశపరిచిందా?
సాయిపల్లవి: విరాటపర్వం చేసేటప్పుడే నటిగా చాలా సంతృప్తి చెందా. ఆ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అయితే ప్రేక్షకులు ఇచ్చిన తీర్పే నాకు ముఖ్యం.ఏం చేసిన ఆడియెన్స్ ఆదరిస్తారనే చేస్తాను.
- రానా 'గార్గి' సినిమాను సమర్పిస్తున్నారు కదా? అదెలా?
సాయిపల్లవి: ఒక కాల్ చేశాను ఆయన వెంటనే స్పందించారు. ఆయన గార్గిని ప్రెజెంట్ చేయటం గొప్ప విషయం. తమిళ్ లో సూర్య గారు సమర్పిస్తున్నారు.
- మిమ్మల్ని అల్లరి అమ్మాయి పాత్రలో చూసి చాలా రోజులైంది..ఇలా బరువైన పాత్రలే చేయడానికి కారణం?
సాయిపల్లవి: అదేం లేదు.ఒక నటిగా నేను అన్ని పాత్రలను చేయగలనని నిరూపించుకోవాలి కదా..కాని నాకు మిస్సయినట్లు అనిపించింది, త్వరలో మళ్లీ అల్లరిపాత్రలో నటిస్తాను.
- ఇటీవల మీరు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై మీ స్పందన?
సాయిపల్లవి: బాధపడ్డాను...నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారనుకున్నాను. నా మాటల్లోని భావాన్ని అర్థం చేసుకుంటే ఎటువంటి వివాదం జరిగి ఉండేది కాదు. నా మాటలను రాజకీయంగా వాడుకోవటం దురదృష్టకరం. ప్రస్తుతం అది ముగిసిపోయింది.
- ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నారు కదా? భవిష్యత్‌లో నిర్మాత, దర్శకురాలిగా ఏమైనా మారాతారా?
సాయిపల్లవి: ప్రస్తుతం అటువంటి ఆలోచనలు లేవు. ఇప్పుడు నన్ను నేను నటిగా నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నా. హిందీ, మరాఠీ భాషల్లోను అవకాశాలు వస్తున్నాయి. కానీ, ముందు మనం చేయగలిగింది చేయాలి కదా.
- 'జై భీమ్' తో భారీ హిట్ కొట్టిన సూర్య ఈ సినిమాను ప్రజెంట్ చేస్తున్నారు కదా? ఆ సెంటిమెంట్ ఈ సినిమాకు వర్కౌట్ అవుతుందా?
సాయిపల్లవి: ఆ సినిమా చేసేటప్పుడు ఆయన ఏ విధంగా కథని నమ్మారో, నేనూ ఒక గొప్ప కథను ప్రేక్షకులకు చూపించబోతున్నాం అని నమ్ముతున్నాను. కచ్చితంగా ఆ నమ్మకం ఈ సినిమాతో నిజమవుతుంది
ఇదీ చదవండి: మాళవిక, అషురెడ్డి బోల్డ్ షో.. బ్లాక్ డ్రెస్‌లో ఆ అందాలు ఎలా ఉన్నాయంటే..!