- చిత్రం: డంకీ
- నటీనటులు: షారుక్ ఖాన్, తాప్సీ, విక్కీ కౌశల్, బొమన్ ఇరానీ, దియా మిర్జా, సతీశ్ షా, అనిల్ గ్రోవర్ తదితరులు
- సినిమాటోగ్రఫీ: సి.కె.మురళీధరన్, మనుశ్ నందన్
- ఎడిటింగ్: రాజ్‌కుమార్ హిరాణీ
- నేపథ్య సంగీతం: అమన్ పంత్
- పాటలు: ప్రీతమ్
- నిర్మాణ సంస్థలు: జియో స్టూడియోస్, రెడ్ చిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్, రాజ్‌కుమార్ హిరాణీ ఫిల్మ్స్
- నిర్మాతలు: గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండే;
- రచన: అభిజత్ జోషి, రాజ్‌కుమార్ హిరాణీ ద
- ర్శకత్వం: రాజ్‌కుమార్ హిరాణీ
- విడుదల తేదీ: 21-12-2023
Dunki Movie Review Telugu : 2023లో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న స్టార్ షారుక్ ఖాన్. గుర్తుండిపోయే చిత్రాలను అందించిన దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన డంకీ కోసం ప్రేక్షకులు ఎదురు చూశారు. ఇది నా మనసుకి బాగా దగ్గరైన కథ అని షారుక్ స్వయంగా చెప్పడం, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. మరి ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం.
కథేంటంటే?
పంజాబ్‌లోని ఓ చిన్న పల్లెటూరికి చెందినవాళ్లు మన్ను (తాప్సి), సుఖి (విక్కీ కౌశల్), బుగ్గు (విక్రమ్ కొచ్చర్), బల్లి (అనిల్ గ్రోవర్) ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య. వాటి నుంచి గట్టెక్కడానికి ఇంగ్లండ్ వెళ్లడమే మార్గం. కానీ, వీసాలకి తగినంత చదువు, డబ్బు వీరి వద్ద ఉండదు. ఈ క్రమంలోనే ఆ ఊరికి పఠాన్ కోట్ నుంచి జవాన్ హర్ దయాల్ సింగ్ థిల్లాన్ అలియాస్ హార్డీ సింగ్ (షారుక్ ఖాన్) వస్తాడు. ఆ నలుగురి పరిస్థితులను అర్థం చేసుకుని సాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇందు కోసం రకరకాల ప్రణాళికలు రచిస్తాడు. వీసా ఇంటర్వ్యూల్లో గట్టెక్కేందుకు గులాటి (బొమన్ ఇరానీ) దగ్గర అందరూ కలిసి ఇంగ్లీష్ నేర్చుకుంటారు. కానీ, ఆ ఐదుగురిలో ఒకరికి మాత్రమే వీసా వస్తుంది. మిగిలినవారికి దారులు మూసుకుపోతాయి. అయినా సరే, అక్రమ మార్గాన (డంకీ ట్రావెల్) ఇంగ్లాండ్‌లోకి ప్రవేశించాలని నిర్ణయించుకుంటారు. ఆ క్రమంలో వాళ్లకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్ని దేశాల సరిహద్దుల్ని దాటి వెళ్లగలిగారా? ఇంతకీ వాళ్ల సమస్యలేమిటి? తిరిగి మాతృదేశానికి వచ్చారా? తదితర విషయాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.
ఎలా ఉందంటే?
ఆర్ధ్రత నిండిన సామాజికాంశాలు, హత్తుకునే భావోద్వేగాలు, అదే స్థాయి హాస్యంతో కట్టిపడేసే దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ. ఈసారి కూడా ఆ అంశాలకి ఏమాత్రం లోటు చేయకుండా డంకీని తెరకెక్కించారు. సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ స్థాయి మాస్‌కు, ఆయన మార్క్ రొమాంటిక్ ఇమేజ్ ఏమాత్రం ప్రభావితం కాకుండా తనదైన శైలిలోనే కథని మలిచాడు హిరాణీ. నవ్విస్తూ, హృదయాలను బరువెక్కిస్తూ, సాహసోపేతమైన డంకీ ప్రయాణంలో ప్రేక్షకుల్ని భాగం చేశాడు. ఇంగ్లండ్‌లో కథని మొదలుపెట్టిన దర్శకుడు.. ఆ తర్వాత పంజాబ్‌లోని పల్లెటూరిలో ప్రేక్షకుల్ని లీనం చేస్తాడు. మన్ను, బుగ్గు, బల్లిల కుటుంబ నేపథ్యాలను, ఆ ఊరికి హార్డీ సింగ్ రావడానికి గల కారణాన్ని ఆవిష్కరిస్తూ సన్నివేశాల్ని మలిచాడు. వాళ్లంతా కలిశాక వీసా ప్రయత్నాలు, ఇంగ్లీష్ నేర్చుకోవడం, డంకీ రూట్లో ఇంగ్లాండ్‌కు వెళ్లాలని నిర్ణయించుకోవడం వంటి సన్నివేశాలతో ప్రథమార్ధం సాగుతుంది.
ఇందులో సుఖి కథ హృదయాల్ని కదిలిస్తుంది. ద్వితీయార్ధంలో డంకీ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లు కీలకం. వలసదారుల పరిస్థితులు ఎంత దయనీయంగా ఉంటాయో, ఎన్ని సాహసాలు చేయాలో, వెళ్లాక విదేశాల్లో వారి బతుకులు ఎంత దుర్భరంగా ఉంటాయో చూపించిన తీరు ఆకట్టుకుంది. వీసా కోసం ఇంటర్వ్యూల్లో పాల్గొన్నప్పుడు ఇంగ్లిష్ రాదని తిరస్కరిస్తే.. పంజాబీ రాకపోయినా ఇక్కడ బతుకుతున్నారు కదా? అప్పట్లో మన భాష నేర్చుకునే ఆంగ్లేయులు మన దేశానికి వచ్చారా? అంటూ పాత్రలు సంధించే ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆలోచనలు రేకెత్తిస్తాయి. ద్వితీయార్ధం మొత్తం భావోద్వేగాలే కీలకం. హార్డీ, మన్ను ప్రేమకథ ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లోనూ ఆ జంట మధ్య సాగే ప్రేమ నేపథ్యం కన్నీళ్లు పెట్టిస్తుంది. కథలోని భావోద్వేగాలు, సునిశిత హాస్యం ఆకట్టుకున్నా.. కథనంలో పెద్దగా మేజిక్ కనిపించదు. ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సాగే ఈ కథ.. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని రేకెత్తించదు. వలసదారుల్లో సవాళ్లని పైపైనే స్పృశించినట్టు అనిపిస్తుంది.
బలాలు
+ భావోద్వేగాలు.. హాస్యం
+ నటీనటులు
+ కథానేపథ్యం
బలహీనతలు
- ఊహకు అందే కథ, కథనం
- సాగదీతగా కొన్ని సన్నివేశాలు
- " class="align-text-top noRightClick twitterSection" data="">
చివరిగా: హత్తుకునే భావోద్వేగాలతో.. డంకీ!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!