దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్ నటించిన 'సీతారామం' సినిమా అఖండ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లోనే కాదు ఉత్తరానా తన సత్తా చాటుతోంది. అయితే హిందీ 'సీతారామం' విజయోత్సవ సభకు వచ్చిన దుల్కర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షారుక్ ఖాన్ ఒక లెజెండ్ అని.. తనని ఆయనతో పోల్చవద్దని అన్నారు.
"నేను షారుక్‌కు పెద్ద అభిమానిని. ఆయన సినిమాలను చూస్తూ పెరిగా. ఎంతోమందికి ఆయన స్ఫూర్తి. ఆయన తన అభిమానులను చూసుకునే తీరుకు నేనేప్పుడు ఆశ్చర్యపోతుంటాను. ఎవరైన మాట్లాడాలని వస్తే.. ఆయన ఎంతమందిలో ఉన్నా ప్రతి ఒక్కరితో ఎంతో శ్రద్ధగా మాట్లాడతారు. నేను చిన్నప్పుడు మా అక్కతో కలిసి షారుక్ సినిమాలను చూసేవాడిని. అలా చూసిన వాటిల్లో 'దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే' నాకు చాలా ఇష్టమైన సినిమా. ఆ సినిమా చాలాసార్లు చూశాను. నాకు ఎప్పుడైనా భవిష్యత్తుపై సందేహం వేసినప్పుడు నేను షారుక్‌ను మనసులో తలచుకుంటా. ఆయన కేవలం నటుడే కాదు ఎంతో గొప్ప వ్యక్తి. నేను పక్కవారితో ఎలా మాట్లాడాలో ఆయన్ని చూసే నేర్చుకున్నాను. నాకు తెలియకుండానే ఆయన నాపై చాలా ప్రభావం చూపారు. నన్ను ఆయనతో పోల్చడం నా దృష్టిలో ఆయన్ని అవమానించినట్లే. ఎందుకంటే షారుక్ లాంటి వ్యక్తి మరొకరు ఉండరు" అంటూ తన వీరాభిమానాన్ని దుల్కర్ సల్మాన్ తెలియజేశారు.
ఇదీ చూడండి: మహేశ్, జక్కన్న చిత్రం.. తెలుగు, ఇంగ్లిష్లో ఒకేసారి షూటింగ్!.. రిలీజ్ డేట్ ఇదే!