Dilraju about ticket rates: సినిమా టికెట్ ధరలపై ఇటీవల తానొకటి చెప్తే మీడియాలో మరో రకంగా వచ్చిందని అన్నారు నిర్మాత దిల్‌రాజు. ఎక్కడ తప్పు జరిగిందో తనకు అర్థమవట్లేదని చెప్పారు. కాగా, ఓటీటీల ప్రభావం, సినిమా నిర్మాణ వ్యయం, థియేటర్లకు ప్రేక్షకులు పెద్దగా రాకపోవడం.. ఇలా తదితర అంశాలపై టాలీవుడ్ నిర్మాతలు ఇటీవల సమావేశమయ్యారు. అందులో సినిమా టికెట్ ధరలు గురించీ చర్చించారని, కొన్ని సినిమాలకు ఓ నిర్ణీత ధర నిర్ణయించాలని తాము అనుకున్నట్లు తెలిపారు. ఆయన నిర్మించిన 'థ్యాంక్ యూ' సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో ఈ విషయాన్ని చెప్పారు.
"థ్యాంక్ యూ సినిమా టికెట్ ధరలపై ఇటీవల నేనొకటి చెప్తే మీడియాలో మరో రకంగా వచ్చింది. ఎక్కడ తప్పు జరిగిందో నాకు అర్థమవట్లేదు. జీవో ప్రకారమే మా చిత్రం 'ఎఫ్ 3' టికెట్ ధరలను అందుబాటులో ఉంచాం. ఆ తర్వాత విడుదలైన 'విక్రమ్', 'మేజర్' చిత్ర బృందాలూ తగ్గించాయి. 'థ్యాంక్ యూ' కూడా ఈ జాబితాలోకే వస్తుంది. హైదరాబాద్, వరంగల్‌లాంటి నగరాల్లో రూ. 150+ జీఎస్టీ (సింగిల్ స్క్రీన్స్), రూ. 200+ జీఎస్టీ (మల్టీప్లెక్స్)గా ఈ సినిమా టికెట్ ధరలుంటాయి. స్టార్ హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ చిత్రాలు మినహా మిగిలిన అన్ని సినిమాలకు ఇకపై ఇవే ధరలు వర్తించనున్నాయి" అని దిల్ రాజు తెలిపారు.
అనంతరం, 'థ్యాంక్ యూ' గురించి మాట్లాడుతూ.. "ఇటీవల, ఈ సినిమా తొలి కాపీని చూశా. నటన, దర్శకత్వం, ఎడిటింగ్, సంగీతం, ఛాయాగ్రహణం.. ఇలా అన్ని విభాగాల వారు తమ పనిని తాము అద్భుతంగా చేశారు. నాతోపాటు ఈ చిత్రాన్ని 50, 25 ఏళ్ల వయసున్న ఉన్న ఇద్దరు ప్రేక్షకులు చూశారు. వారి నుంచి మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులందరి మదిలో నిలిచిపోతుందనే నమ్మకం ఉంది" అని దిల్ రాజు అన్నారు. నాగచైతన్య హీరోగా దర్శకుడు విక్రమ్ కె. కుమార్ తెరకెక్కించిన చిత్రమిది. రాశీఖన్నా, మాళవిక నాయర్, అవికాగోర్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ ప్రెస్‌మీట్‌లో చైతన్య, మాళవిక నాయర్, విక్రమ్ కుమార్, రచయిత బీవీఎస్ రవి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: NBK 107: 'రాయల్టీ కా బాప్' బాలయ్య ఈజ్ బ్యాక్.. షూటింగ్ స్పాట్‌కు పోటెత్తిన ఫ్యాన్స్