Rakesh master death : కొరియోగ్రఫీ చేసిన రాకేశ్ మాస్టర్(53) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్‌మీడియా ఫాలో అయ్యే ప్రతివారికి ఆయన తెలిసే ఉంటారు. ఒకప్పుడు స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల చిత్రాల(దాదాపు 1500) వరకు పనిచేసిన ఆయన.. ఇప్పుడు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో హాట్‌టాపిక్‌గా నిలుస్తుంటారు. అయితే ఇప్పుడు ఆయన ఆకస్మిక మరణంతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సోషల్ మీడియా వేదికగా పలువురు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన ఫాలోవర్స్ గత జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటూ ఆయన మాట్లాడిన మాటల్ని నెట్టింట్లో ట్రెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఆయన వివిధ సందర్భాల్లో పంచుకున్న మాటలను చూద్దాం..
జీవితంపై విరక్తి.. నా అనుకున్న వాళ్లంతా చనిపోయారు. దీంతో జీవితంపై విరక్తి కలిగింది. నా తమ్ముడంటే చాలా ఇష్టం. అతడు చనిపోయినప్పుడు ఎంత బాధ పడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఆ తర్వాత అమ్మ, అక్క కొడుకు, నాన్న అందరూ చనిపోయారు. నాకు చావంటే భయం లేదు. అయినా ఈ సంఘటనల వల్ల ఫోన్ కాల్ వస్తే మాత్రం భయపడిపోయేవాణ్ని" అని గతంలో కంటతడి పెట్టుకున్నారు రాకేశ్.
మరిచిపోలేని క్షణాలు.. హీరో వేణు నటించిన 'చిరునవ్వుతో' సినిమాలో 'నిన్నలా మొన్నలా లేదురా' పాటకు రాకేశ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. దీని గురించి ఓ సారి మాట్లాడినప్పుడు.. "సినిమాకి పని చేసే ఛాన్స్ హీరో వేణు నాకు ఇచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాను. నా లైఫ్‌లో మరిచిపోలేని క్షణాలు అవి" అని రాకేశ్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.
ఎవర్నీ నమ్మను.. ఓ వ్యక్తి దగ్గర రూ. రెండు లక్షలు అప్పు చేశాను. రూ. 30 వేలు తిరిగి ఇచ్చాను. కొన్ని రోజులకు అప్పు ఇచ్చిన వ్యక్తి చనిపోయాడు. ఆ తర్వాత ఆయన కొడుకు వచ్చి డబ్బులు అడిగాడు. అప్పుడు ఇంటికి సంబంధించిన పత్రాలు ఇచ్చేశాను. మీ నాన్నకు డబ్బులన్నీ తిరిగి ఇచ్చేశా అని నేను చెప్పొచ్చు.. కానీ అలా చెబితే మోసం చేసినట్టు అవుతుంది. నేను నన్ను తప్ప ఎవర్నీ నమ్మను. అని ఓ సందర్భంలో చెప్పారు.
శిష్యులకు అదే నేర్పా.. ఆకలితో స్నేహం చేశాను. నాతో కలిసి చాలా మంది జర్నీ చేశారు. కొందరు వదిలి వెళ్లిపోయారు. 'నీ మాస్టర్‌ను నమ్మి ఉంటే.. నీ జీవితం మాడిపోయిన దోస అయిపోతుంది' అని శేఖర్‌తో ఎవరో చెప్పారట. అయినా శేఖర్ వదిలి వెళ్లలేదు. నా దగ్గరే ఉంటే విషమైనా, తీపి అయినా కలిసి పంచుకుందాం అని అందరికీ నేర్పాను. శేఖర్, సత్యం దానికే కట్టుబడి నాతోనే కలిసి ప్రయాణించారు అని ఓ సారి 'ఢీ' స్టేజ్‌పై రాకేశ్ ఎమోషనల్ అయ్యారు. అయితే ఇప్పుడు శేఖర్ మాస్టర్ టాలీవుడ్‌లో టాప్ కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతున్నారు.
ఏదీ శాశ్వతం కాదు.. దుస్తులు, శరీరం, ఇల్లు ఏదీ శాశ్వతం కాదు. మట్టిలో కలిసిపోయేదే శాశ్వతం అని గతంలో అన్నారు రాకేశ్ మాస్టర్. అలానే తన అంతిమ యాత్ర ఎలా ఉంటుందో ముందుగానే చూసుకోవాలనిపించి సంబంధిత వీడియో కూడా తీసినట్లు చెప్పారు. "నా భార్య తండ్రి మామగారు సమాధి పక్కన ఓ వేప మొక్క నాటాను. దాన్ని పెంచుతాను. నేను చనిపోయాక ఆ చెట్టు కిందే నన్ను సమాధి చేయండని చెప్పాను" అని ఓ సారి చెప్పారు.
ఇదీ చూడండి :