Anasuya Bharadwaj Twitter : సామాజిక మాధ్యమాల వేదికగా ట్రోలింగ్ చేసే వారికి ప్రముఖ వ్యాఖ్యాత అనసూయ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై తనని, తన కుటుంబాన్నీ అవమానిస్తూ ట్వీట్స్ చేస్తే వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం ఆమె వరుస ట్వీట్స్ చేశారు.
"ఛీ ఛీ.. అసలు ఇంత చెత్తా!! బాబోయ్.. క్లీన్ చేసి చేసి విసుగొస్తోంది. ఇలాంటి వివాదాల్లోకి నా కుటుంబాన్ని లాగితే మిమ్మల్ని కటకటాల్లోకి పంపించాల్సి ఉంటుంది. మీరు ఎన్ని అంటున్నా దయతో వ్యవహరిస్తున్నందుకు మీరిలా చేస్తున్నారు కదా.!! ఇకపై, నన్ను 'ఆంటీ' అని పిలుస్తూ అవమానించేలా పోస్టులు పెట్టిన ప్రతి ఒక్కరి అకౌంట్ స్క్రీన్‌షాట్ తీసుకుని పోలీసు కేసు పెడతా. సరైన కారణం లేకుండా నన్ను ఇబ్బంది పెట్టినందుకు బాధపడే స్థాయికి మిమ్మల్ని తీసుకువెళ్తా. ఇదే నా ఆఖరి వార్నింగ్"
"అలాగే, ఇక నుంచి మీరేం చేస్తున్నారో మీకు తెలిసి వచ్చేలా నన్ను వేధిస్తూ మీరు చేస్తోన్న ట్వీట్స్ అన్నింటినీ రీట్వీట్ చేస్తా. నేనెందుకు ఇలా చేస్తున్నానో తెలుసుకోండి. నేను పిరికి దాన్ని కాదు. ఫ్యాన్స్ వెనుక దాక్కొని లేను. నన్ను వేధించడం కోసం డబ్బులు చెల్లించి ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేయించి ఎన్నో ఏళ్ల నుంచి ట్వీట్స్ చేయిస్తున్నారు. అసలేం జరిగిందో మీకేమాత్రం తెలియదు" అని అనసూయ రాసుకొచ్చారు.
అనసూయ వార్నింగ్ ఇవ్వడానికి కంటే ముందు ఏం జరిగిందంటే.. గురువారం మధ్యాహ్నం ఆమె ఓ ట్వీట్ చేసింది. 'అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కానీ, రావటం మాత్రం పక్కా!!' అని ఆమె పెట్టిన ట్వీట్‌పై ఓ హీరో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అభిమాన హీరోని ఉద్దేశించే ఆమె ట్వీట్ చేసిందంటూ మండిపడ్డారు. ఈ మేరకు అనసూయకు వ్యతిరేకంగా వరుస పోస్టులు పెట్టారు. నెటిజన్ల నుంచి వస్తోన్న వ్యతిరేకతపై ఆమె మరోసారి స్పందిస్తూ.. "మీరు నన్నెంత నిందించినా.. ఆ వ్యాఖ్యలన్నింటినీ మీ అభిమాన హీరో\హీరోయిన్‌కు బదిలీ చేస్తున్నా." అని ఆమె రాసుకొచ్చారు. దానిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. "నా అభిమాన హీరో నీ భర్తనే ఆంటీ" అని కామెంట్ చేయడం వల్ల అనసూయ ఈ విధంగా వరుస ట్వీట్స్ చేశారు. #SayNOtoOnlineAbuse అనే ట్యాగ్‌ని జత చేస్తూ ఆమె ట్విటర్లో అందరికీ సమాధానాలిస్తున్నారు.







ఇవీ చదవండి: ఆ కామెంట్స్ చేస్తే ఎవరినీ వదలనని అనసూయ వార్నింగ్
ఉసురు ఊరికే పోదని అనసూయ ట్వీట్, ఎవరినుద్దేశించంటూ నెట్టింట చర్చ