Adipurush Arun govil : రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన 'ఆదిపురుష్'పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ కొనసాగుతూనే ఉంది. పాత్రల చిత్రీకరణ, సంభాషణలను వ్యతిరేకిస్తూ పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, సినీ ప్రియులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే ఇప్పుడీ చర్చలో భాగమయ్యారు అలనాటి 'రామాయణ్' ధారావాహిక రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన 'ఆదిపురుష్'పై వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఇతిహాసాన్ని ఆధునీకరించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఆదిపురుష్ హాలీవుడ్ కార్టూన్ చిత్రం అని అన్నారు.
"రామాయణం.. విశ్వాసానికి సంబంధించిన విషయం. దాని రూపాన్ని తారుమారు చేయడం ఆమోదయోగ్యం కాదు. ఈ చిత్రాన్ని నేనింకా చూడలేదు. కానీ సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలను చూశాను. కొన్ని వివాదస్పదంగా వినిపిస్తున్న సంభాషణలను విన్నాను. 'రామాయణం'లో ఇలాంటి భాషను నేను అంగీకరించను. అసలు ఇన్నేళ్లుగా మనందరికీ తెలిసిన, ప్రేమించిన రామాయణ వర్ణనలో తప్పేముంది? అందులోని అంశాలు, విషయాలను మార్చాలిన అవసరం ఏమిటి? బహుశా మూవీటీమ్‌కు సీతారాములపై సరైన అవగాహన లేకపోవచ్చు. అందుకే వారు ఈ మార్పులు చేశారు." అని పేర్కొన్నారు. ఇకపోతే ఈ సినిమా టీజర్ రిలీజైనప్పుడు మూవీటీమ్‌కు తాను కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చినట్లు చెప్పారు.
Adipurush prabhas look : ఈ చిత్రంలో పాత్ర ధారుల లుక్స్‌పై కూడా మాట్లాడారు అరుణ్ గోవిల్. "ప్రభాస్ కటౌట్ రాముడిగా సరిపోదు. ఆయన ఓ స్టార్. దాని వరకు ఆయన బాగానే చేశారు. ఆయన లుక్స్‌ను మరింత బాగా చూపించడానికి మేకర్స్ ఇంకా ఎక్కువగా కష్టపడాల్సింది. ఆయన సరిగ్గా చేయలేదని, ఇతర నటీనటులు సరిగ్గా చేయలేదని నేను చెప్పడానికి ఇష్టపడను. ఈ సినిమాలో లోపం మొదట వారి లుక్స్ అని అనుకుంటున్నాను. లుక్స్ సరిగ్గా ఉంటే యుద్ధం సగం గెలిచినట్టే. అవే ఈ చిత్రంలో ఎక్కువ సమస్యలు సృష్టించాయి." అని గోవిల్ పేర్కొన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అందుకే ప్రభాస్‌ను ఎంచుకున్నాను.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు ఓం రౌత్ కూడా పాల్గొన్నారు. రాముడి పాత్రలో ప్రభాస్‌ను ఎంపిక చేసుకోవడానికి గల కారణాన్ని కూడా వివరించారు. ఆ పాత్ర కోసం ప్రభాస్‌ను ఒప్పించడానికి చాలా కష్టపడినట్లు వివరించారు.
"ఆదిపురుష్ కొత్త తరం వారి కోసం రూపొందించిన సినిమా. మొత్తం రామాయణాన్ని స్క్రీన్‌పై చూపించలేము. అందుకే యుద్ధకాండను మాత్రమే తీసుకున్నాను. నాకు పర్సనల్‌గా కూడా ఈ భాగం ఎక్కువ ఇష్టం. ఇందులో రాముడు ధైర్యవంతుడిగా కనిపిస్తారు. ప్రభాస్ ఈ పాత్రకు కచ్చితంగా సరిపోతారని భావించాను. మన హృదయంలోని భావాలు కళ్లలో కనిపిస్తాయి. ప్రభాస్ కళ్లలో నీతి, నిజాయతీ కనిపిస్తాయి. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ ఎంతో వినయంగా ఉంటారు. అందుకే సినిమా చేయాలని అనుకున్నప్పుడే రాముడిగా ప్రభాస్ మాత్రమే సరైనవాడని అనుకున్నాను. ప్రభాస్‌కు ఈ విషయం మొదట చెప్పగానే ఆశ్చర్యపోయారు. ఆయన్ను ఒప్పించడం అంత ఈజీగా అవ్వలేదు. ఫోన్‌లో పాత్రకు సంబంధించిన వివరాలను చెప్పడానికి ఎంతో కష్టపడ్డాను. ఒకసారి కలిసి కథ చెప్పగానే ప్రభాస్ ఓకే చెప్పారు. చాలా శ్రద్ధగా చేశారు. భవిష్యత్తులోనూ మా స్నేహం ఇలాగే కొనసాగుతుందని భావిస్తున్నాను" అని ఓం రౌత్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి :
ఆ స్వామీజీ డైలాగ్ కాపీ కొట్టడం వల్లే 'ఆదిపురుష్'కు ఇన్ని చిక్కులు!
'ఆదిపురుష్' @340 కోట్లు.. రాముడిగా ప్రభాస్‌ను అందుకే సెలెక్ట్ చేశారా?