'బొమ్మరిల్లు' హాసినిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కథానాయిక జెనీలియా దేశ్‌ముఖ్. తనకి పెళ్లయ్యాక పదేళ్ల విరామం తర్వాత పూర్తిస్థాయి పాత్రలో నటించిన మరాఠీ చిత్రం 'వేద్'. భర్త రితేష్ దేశ్‌ముఖ్ తెరకెక్కించారు. ఇది తెలుగు 'మజిలీ'కి రీమేక్. విమర్శకుల ప్రశంసలతోపాటు బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలో జెనీలియా సోమవారం మీడియాతో మాట్లాడారు.
- సినిమాలకు పదేళ్ల విరామం ఇవ్వడం ద్వారా గృహిణిగా, నా పిల్లలకు తల్లిగా జీవితంలో ఇతర పనులు చాలానే చేయగలిగా. నేను జీవితంలో ఏదీ ముందుగా అనుకొని, ప్రణాళిక ప్రకారం చేయలేదు.
- ఒక ఆర్టిస్టుగా నిజ జీవితంలో చాలామందిని దగ్గరగా గమనిస్తుంటా. అయితే ఒక గృహిణిగా, భార్యగా నాకు అనుభవం లేకపోతే 'వేద్'లోని శ్రావణి పాత్ర బాగా చేయలేకపోయేదాన్నేమో.
- ఇప్పటికీ కొన్నిరకాల పాత్రలు చేయడానికి సమయం కావాలనీ, నాలో పరిపక్వత రావాలని భావిస్తుంటా. కానీ రితేష్ ఇదే సరైన సమయం అని నువ్వేం ఫీలవుతున్నావో అది చేస్తే చాలు అంటూ శ్రావణి పాత్రని తీర్చిదిద్దాడు.
- తల్లిగా నా పిల్లల ప్రతి అవసరాన్నీ దగ్గరుండి చూసుకోవాలనుకుంటా. అలా చేయలేనప్పుడు 'నువ్వు పని చేస్తున్నప్పుడు ఇంటిని నేనే చూసుకుంటా' అని అన్ని బాధ్యతలు తీసుకుంటాడు రితేష్. తన ప్రోత్సాహం, మా ఇద్దరి మధ్య ఉన్న అవగాహనతోనే ఈ చిత్రం పూర్తి చేయగలిగా.
- ప్రేక్షకుల ఆశీర్వాదం వల్లే ఆరు భాషల్లో, మంచి సినిమాల్లో నటించా. దీన్ని నా అదృష్టంగా భావిస్తా. నాకున్న అనుభవంతో ఎవరైనా కొత్త ప్రాజెక్టులు వస్తే సంతోషంగా స్వీకరిస్తా.